Revanth Reddy: తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కీలక భేటీకి హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని సమర్థంగా తిప్పికొట్టడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అసెంబ్లీ సజావుగా సాగకుండా, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారం కుట్రలు చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ గేట్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలపడమే కాకుండా, విధుల్లో ఉన్న మహిళా పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ను అత్యంత అభ్యంతరకరమైన, అసభ్య పదజాలంతో దూషించి సభా గౌరవాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు దళిత నేతలు ఎర్రవల్లి వెళ్తే.. వారు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేసి అంటరానితనాన్ని, ఫ్యూడల్ అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నేతలకు అభినందనలు – అసెంబ్లీ వ్యూహం..
బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను, కుట్రలను సమర్థంగా తిప్పికొట్టి అసెంబ్లీలో, బయట ప్రజలకు వాస్తవాలు వివరించిన కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆరు గ్యారెంటీల అమలు తీరును సభ వేదికగా బలంగా వినిపించాలని.. విపక్షాలు లేవనెత్తే ఏ అంశానికైనా ధీటుగా ఆధారాలతో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు.
