వన్ స్టేట్ – వన్ టీమ్ – వన్ మిషన్.. అదే స్వర్ణాంధ్ర..
ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పాలన కూడా స్తంభించిపోయినట్లేనని సీఎం హెచ్చరించారు. బ్యూరోక్రసీ, రాజకీయ నేతలు నిరంతరం తమ నైపుణ్యాలకు పదును పెడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాలనలో క్రెడిబిలిటీ (విశ్వసనీయత) అత్యంత కీలకమని ఉద్ఘాటించారు.
15 శాతం వృద్ధి లక్ష్యం..
2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుంటే ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రంలో 13.44 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.25,450 కోట్లు పెరిగాయని తెలిపారు. ఈ వృద్ధి రేటును 15 శాతానికి తీసుకెళ్లే దిశగా జిల్లాలను గ్రోత్ ఇంజిన్లుగా మార్చాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల పురోగతి
గత 27 నెలల్లో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు వెచ్చించామని సీఎం తెలిపారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి పనులను పరుగులు పెట్టించామని, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. కరవు ప్రాంతాలకు నీళ్లివ్వడమే తనకు అసలైన సంతృప్తి అని, ‘వాటర్‌మ్యాన్’గా గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
గత పాలకుల కల్తీ మద్యంపై నిప్పులు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నాసిరకం ‘జే బ్రాండ్స్’ కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది ఆరోగ్యం నాశనమైందని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
పారదర్శక విధానం..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ కల్తీ మద్యం బ్రాండ్లన్నింటినీ రద్దు చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలో పారదర్శకమైన, నాణ్యమైన మద్యం మాత్రమే విక్రయించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఫేక్ ప్రచారాలకు తక్షణ కౌంటర్ – కలెక్టర్లకు డెడ్లైన్లు..
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని, ఈ విషయంలో విపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టిన ఇద్దరు మహిళా అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఫేక్ ప్రచారాలపై సరైన సమయంలో స్పందించకపోతే ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
టాప్ ప్రాజెక్టులపై దృష్టి:
సమీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో 25 ముఖ్యమైన ప్రాజెక్టులను, నియోజకవర్గంలో 10 నుంచి 15 ప్రాధాన్య ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని వేగంగా పూర్తి చేయాలని సూచించారు.తాగునీటి సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని, 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ‘భూ వివాదాలు లేని రాష్ట్రం’గా తీర్చిదిద్దేందుకు అధికారులు సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు.