Kakinada AE Case

Kakinada AE Case: సౌజన్య పాత్రపై పోలీసులకే ఎదురు ప్రశ్నలు..

Kakinada AE Case: కాకినాడ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మూడు రోజుల కస్టడీలో భాగంగా నిందితుడు సాదిక్‌ను సర్పవరం పోలీసులు రెండో రోజూ విస్తృతంగా విచారించారు. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేయగా, చాలా ప్రశ్నలకు సాదిక్ సమాధానాలు దాటవేస్తూ పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవైపు సాదిక్ చెప్పే మాటలను విశ్లేషిస్తూనే.. మరోవైపు తమ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు (CDR), సాంకేతిక ఆధారాలతో పోలీసులు సరిపోల్చి చూస్తున్నారు.

విచారణలో కీలక అంశాలు – సాదిక్ సమాధానాలు..

హైదరాబాద్‌లో విషపూరిత కెమికల్స్ కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని సాదిక్ అంగీకరించాడు. అయితే ఆ రసాయనాలను తాను ఎక్కడా ఉపయోగించలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
జగదీష్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూనే, సౌజన్య అంశాన్ని అతడే తెరపైకి తెచ్చాడు. “సౌజన్య పాత్ర లేకుండా అసలు ఈ వ్యవహారం నడుస్తుందా? ఆమె, ఆమె తండ్రి నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయరు?” అంటూ ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. “ఆస్తులను తన పేరుపైకి మార్చాలని సౌజన్య కుటుంబాన్ని బెదిరించావా?” అని పోలీసులు సూటిగా ప్రశ్నించినప్పుడు మాత్రం సాదిక్ నోరు మెదపకుండా పూర్తిగా మౌనం వహించాడు.
నేను షూటర్‌ని.. విషపూరిత లిక్విడ్ కావాలి.. అత్తరు వ్యాపారుల వెల్లడి
కేసులో అత్యంత కీలకమైన రసాయనాల కొనుగోలుపై హైదరాబాద్‌లో దర్యాప్తు ముమ్మరమైంది. సాదిక్‌కు విషపూరిత ద్రావణాలను విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్‌లను పోలీసులు విచారించారు.
సాదిక్ ఖాన్ తమ వద్దకు వచ్చి.. తాను ఒక షూటర్‌నని చెప్పుకుంటూ అత్యంత విషపూరితమైన లిక్విడ్ కావాలని అడిగాడని వ్యాపారులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మొదట అతడికి థాయ్ పొటాషియం ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
నలుగురు సన్నిహితుల విచారణ – మిగిలింది ఒక్క రోజే:

సాదిక్‌తో నిరంతరం ఫోన్ సంభాషణల్లో ఉన్న నలుగురు సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత సాదిక్ వీరికి ఏ సమాచారం చేరవేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. జగదీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సాదిక్ హడావుడిగా హైదరాబాద్ ఎందుకు వెళ్లాడనే అంశంపైనా పోలీసులు లోతుగా కూపీ లాగుతున్నారు. మూడు రోజుల కస్టడీలో ఇప్పటికే రెండు రోజులు ముగియగా, మిగిలిన చివరి ఒక్కరోజు కస్టడీలో సాదిక్ నుంచి హత్యకు సంబంధించిన కీలక నిజాలను రాబట్టేందుకు పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *