TG Assembly

TG Assembly: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ నోటీస్

TG Assembly: తెలంగాణ శాసనసభలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) సభాహక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు జారీ చేసింది. సభలో నకిలీ సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావిస్తూ సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి నకిలీ ఆధారాలతో మాజీ సీఎం కేసీఆర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పార్టీలో లేని పదవిని సృష్టించారు – బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలు..

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ‘అంతర్జాతీయ కార్యదర్శి’ (International General Secretary) పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును చదివి వినిపిస్తూ కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థలో అసలు ‘అంతర్జాతీయ కార్యదర్శి’ అనే హోదాయే లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎం ప్రస్తావించిన సంధ్యారావు అనే వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాంగ్రెస్ ఐటీ సెల్ సృష్టించిన ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాను అసెంబ్లీ వేదికగా నిజమైన ఆధారంగా చూపించడం దారుణమని మండిపడ్డారు.
రూల్ 168 కింద చర్యలకు డిమాండ్..
కనీస నిజానిజాలు విచారించకుండా, సోషల్ మీడియాలోని ఒక నకిలీ పోస్టును పట్టుకుని అత్యున్నత శాసనసభ గౌరవాన్ని సీఎం తగ్గించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా సభను వేదికగా చేసుకోవడం ముమ్మాటికీ సభాహక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. సభాపతి ముందు అబద్ధాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసెంబ్లీ నిబంధనలు ‘రూల్ 168’ కింద సభాహక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *