Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌లపై అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడం, మహిళల ఎదుట అనుచిత ప్రవర్తన, ఎర్రవల్లి బాటను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వంటి పరిణామాల వెనుక ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పన్నిన లోతైన రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
-
సెప్టెంబర్ 6: అసెంబ్లీ సమావేశాల ముందురోజు సాయంత్రం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుట్రకు రూపకల్పన చేశారు.
-
సెప్టెంబర్ 7: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఉన్మాదుల్లా మారి స్పీకర్‌పై బరితెగించి మాటల దాడి చేశారు, పోలీసులపై చేయి చేసుకున్నారు.
-
సెప్టెంబర్ 8: కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యకర్తలు నిరసనకు వెళ్లిన మార్గాన్ని కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లతో శుద్ధి చేసి దళితులను అవమానించాయి.
పుల్వామా, పార్లమెంట్ దాడులతో పోలిక..
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటిస్తే బీజేపీ అనుబంధ సంస్థలు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాయని, సరిగ్గా అదే తరహా ఫ్యూడల్ అహంకారాన్ని కేసీఆర్ తెలంగాణలో ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేలను దుక్కి దున్ని సమాజానికి అన్నం పెట్టే దళితుడు నడిస్తే ఊరు మైల పడుతుందా? శుద్ధి చేయాల్సింది నేలను కాదు.. కేసీఆర్ మనసుల్లో ఉన్న అహంకార, అంటరాని ఆలోచనలను! సమాజాన్ని కులాల వారీగా చీల్చి రెండు జాతుల మధ్య వైరం పెట్టాలని చూస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని యావత్ సమాజం సామాజిక బహిష్కరణ చేయాలి అని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా దాడులకు పాల్పడిన వారితో పాటు, ఫామ్‌హౌస్‌లో కూర్చుని దీని వెనుక కుట్రలు పన్నిన పెద్దలపై కూడా చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సభలో హెచ్చరించారు.
