Youtuber Rama Nandana

Youtuber Rama Nandana: అంతా భర్త మధుకరే చూసుకుంటారు.. నాకేం సంబంధం లేదు..

Youtuber Rama Nandana: నకిలీ వీసాలు, విదేశీ ఉద్యోగాల పేరిట భారీగా నగదు వసూలు చేసి మోసగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమానందన (నందన) ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. లుక్ ఔట్ నోటీసుల నేపథ్యంలో సోమవారం లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను డిటెయిన్ చేసి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.
పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు మంగళవారం ఆమె తన తల్లి, న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజుల ఆధ్వర్యంలోని విచారణ బృందం దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించింది.
అంతా భర్త మధుకరే చూసుకుంటారు.. నాకేం సంబంధం లేదు..
లండన్ కేంద్రంగా నడుస్తున్న ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ వ్యవహారాలు, వీసాల ప్రాసెసింగ్, ఆర్థిక లావాదేవీలు ఏవీ తనకు తెలియవని నందన పేర్కొన్నారు. ఆ సంస్థలో తాను డైరెక్టర్‌గా గానీ, ఉద్యోగిగా గానీ లేనని చెప్పారు.
తాను కేవలం ఐటీ ఉద్యోగం చేస్తూ, యూట్యూబ్ వీడియోలు మాత్రమే చేసుకుంటానని తెలిపారు. కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యాపారం, డబ్బుల వసూళ్లు మొత్తం తన భర్త మధుకర్, ఎకౌంటెంట్ మాత్రమే చూసుకుంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం లండన్‌లో తమ పిల్లలను భర్త మధుకర్ చూసుకుంటున్నారని, తన విచారణ పూర్తయి తాను తిరిగి వెళ్లాక ఆయనను కూడా భారత్‌కు విచారణకు పంపిస్తానని పోలీసులకు తెలిపారు.
సమాధానాలు దాటవేత – సెప్టెంబర్ 16న మరోసారి విచారణ..
కన్సల్టెన్సీలో వాటా, నిధుల మళ్లింపు, బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాలపై పోలీసులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు ఆమె నుంచి ‘నాకు తెలియదు’ అనే సమాధానమే రావడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.విచారణకు సరైన సహకారం అందించకపోవడంతో ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేసి పంపించివేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో నందనతో పాటు ఆమె భర్త మధుకర్, మామగారి పేర్లు కూడా ఉన్నాయని, నందన వాంగ్మూలంతో ఇప్పుడు మధుకర్‌పై ఉచ్చు బిగుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు.
స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన – జర్నలిస్టులతో లాయర్ల వాగ్వాదం..

యూకే ఉద్యోగం, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) పేరిట తన వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతికుమార్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు కాగా.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మరికొందరు బాధితులు కూడా తాము మోసపోయామంటూ స్టేషన్ వద్దకు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *