Seethakka 

Seethakka: మహిళా పోలీసులపై చేతులు వేశారు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం!

Seethakka:  తెలంగాణ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రెండో రోజూ తారాస్థాయికి చేరింది. సోమవారం అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాట, స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్‌ను దూషించిన సభ్యులను సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. “మా ముఖ్యమంత్రిని అంటే మేం చూస్తూ ఊరుకుంటామా?” అంటూ బీఆర్ఎస్ తీరుపై సీతక్క తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.

 మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన – మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..

అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని సీతక్క సభ దృష్టికి తెచ్చారు. ఆ దృశ్యాలను తాము పరిశీలించామని చెప్పారు.
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..
మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ నేతలపై మహిళా కమిషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఒకవేళ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఉంటే.. దానిపై పూర్తి విచారణ జరిపి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
దళిత, గిరిజన వ్యతిరేక నైజం బీఆర్ఎస్‌ది..
భూస్వామ్య అహంకారం..
ఎస్సీ, ఎస్టీ మరియు అణగారిన వర్గాల ప్రజలు ఉన్నత స్థానాలకు ఎదిగితే బీఆర్ఎస్ భూస్వామ్య విధానం జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
తల్లులు లేరా?..
“లేని తల్లిని ప్రస్తావిస్తూ లకారంతో ఎలా తిడతారు? వీళ్లకు తల్లులు లేరా? వారి తల్లులను ఎవరైనా ఇలాగే అంటే బాధపడరా?” అంటూ ఆమె ఆవేదనతో నిలదీశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తులను దూషిస్తే చట్టప్రకారం అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుందని తేల్చిచెప్పారు.
ఆర్టికల్ 194(3) ప్రయోగించి సస్పెండ్ చేయాలి:
గతాన్ని గుర్తుచేసిన సీతక్క..
2018లో స్పీకర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194(3) ప్రయోగించి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని సీతక్క గుర్తుచేశారు. ఇప్పుడు సభాపతిని అసభ్యంగా దూషించిన బీఆర్ఎస్ సభ్యులపై కూడా అదే నిబంధన ప్రకారం వేటు వేయాలని డిమాండ్ చేశారు.
పోడియం వైపు దూసుకెళ్లడం సంస్కృతా?..

హరీశ్‌రావు సభలో స్పీకర్ పోడియం మీదకు దూసుకెళ్తున్నారని, స్పీకర్‌ను కొడతారా అని ప్రశ్నించారు. చట్టసభకు కొన్ని నైతిక విలువలు, సభా సంప్రదాయాలు ఉంటాయని, నిన్నటి ఘటనపై ఇప్పటివరకు స్పీకర్‌కు కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *