Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతకాలానికే భార్యని చంపిన భర్త.. విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ వివాహిత మృతి కేసును ఎట్టకేలకు ఛేదించిన బొండపల్లి పోలీసులు.. ముందు అందరూ సహజ మరణం అనుకున్నారు. కానీ భర్తే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని పోలీసులు తేల్చారు.
పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన రామ ముత్యాలరావు, అదే గ్రామానికి చెందిన బుంగ సంధ్య పదేళ్ల క్రితం ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి జరిగిన కొంతకాలం బాగానే ఉన్నారు, ఎటువంటి గొడవలు జరగకుండా సంతోషంగా ఉండేవారు. కానీ కాలం మారేకొద్దీ ఇద్దరి మధ్య డబ్బు అనే మహమ్మారి వచ్చింది. అప్పటి నుండి గొడవలు జరగడం మొదలయ్యాయి.
ఆర్థికంగా కష్టాలు వచ్చినా, డబ్బుల అవసరం వచ్చినా భార్య సంధ్యని వాళ్ల ఇంట్లో నుండి తీసుకుని రావాలని చెప్పేవాడు. వినకపోతే చితకబాదేవాడు. తమ కూతురి కష్టాలు చూడలేక ఎలాగైనా ఆమె కాపురాన్ని నిలబెట్టాలని అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. సులభంగా డబ్బులు వస్తుండటంతో రామ ముత్యాలరావు కూడా మారకుండా అదే పనిగా భార్యని కొడుతూ వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు.
కానీ మంగళవారం ఉదయం తన కూతురు సంధ్య మరణవార్త తెలియడంతో అక్కడికి చేరుకున్న సంధ్య కుటుంబ సభ్యులు ఆమె మరణంపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, తమతో పాటు క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు ఇంకా ఇతర కీలక ఆధారాలు సేకరించారు.
పోలీసులు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరంలో ఉన్న హాస్పిటల్‌కి పంపించారు. పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఆమెకి ఊపిరి ఆడకపోవడంతో బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. దీంతో భర్త రామ ముత్యాలరావుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. వాళ్లిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని, కానీ ఆ రోజు మాట మాట పెరగడంతో తన కోపాన్ని ఆపుకోలేక ఆమె నోరు, ముక్కు మూసేసి హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు రామ ముత్యాలరావు పైన కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.
ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇద్దరి మధ్య డబ్బు అనే జబ్బు రావడంతో ఒకరు మరణించారు, ఇంకొకరు జైలులోకి వెళ్లారు.. కష్టపడకుండా సులువుగా డబ్బులు కావాలనుకున్నాడు, చివరికి జీవితం నాశనం చేసుకున్నాడు. దాంతోపాటు తన ఇద్దరు పిల్లల జీవితాలను నాశనం చేసినవాడు అయ్యాడు.
