Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రిగా మారిన అంతర్గత వివాదంలో కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంది. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం వేటు వేసింది. మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆమె ససేమిరా అనడంతో, కేబినెట్ నుంచి ఆమెను తక్షణమే బర్తరఫ్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు అధికారికంగా సిఫార్సు లేఖ పంపారు.
రాజీనామాకు ససేమిరా – గవర్నర్‌కు బర్తరఫ్ లేఖ:
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆమె స్వతంత్రురాలని సురేఖ దంపతులు ఇచ్చిన లిఖితపూర్వక వివరణపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందేనని కమిటీ తేల్చిచెప్పింది.
ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం రాజీనామా చేయాల్సిందిగా హైకమాండ్ సూచించినప్పటికీ సురేఖ వెనక్కి తగ్గలేదు. దీంతో అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ రాజ్‌భవన్‌కు లేఖ పంపారు. ఈ లేఖపై గవర్నర్ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఉద్వాసన – కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీ..
మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటే మరో సీనియర్ నేతపై కూడా పార్టీ వేటు వేసింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద:
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీనియర్ నాయకురాలు నేరెళ్ల శారద నియమితులయ్యారు.
కుడా (KUDA) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి:
వరంగల్ రాజకీయాల్లో ప్రాధాన్యం ఉన్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా జి. సుధారాణిని నియమించారు.
వరంగల్‌లో కొండా వర్గీయుల అత్యవసర భేటీ – రాజకీయ భవిష్యత్‌పై ఉత్కంఠ..
మంత్రి పదవి నుంచి తొలగింపు ఖాయం కావడంతో కొండా సురేఖ హుటాహుటిన వరంగల్‌కు చేరుకున్నారు. తన నివాసంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత ఆమె తదుపరి అడుగు ఎలా ఉండబోతోందనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
