Reliance Bombay Creamery Ice Cream 

Bombay Creamery Ice Cream: ₹10 రూపాయలకే ఐస్‌క్రీమ్.. జియో దెబ్బ తర్వాత.. ఇప్పుడు ఫ్రిజ్‌లలోకి అంబానీ ఎంట్రీ!

Reliance Bombay Creamery Ice Cream: ఫోన్ రీఛార్జ్ ఖర్చులు తగ్గించి, జియోతో దేశవ్యాప్తంగా సామాన్యుడి చేతికి ఇంటర్నెట్ అందించిన ముఖేష్ అంబానీ.. ఇప్పుడు ప్రతి ఇంటి ఫ్రిజ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వ్యాపార రంగంలో ఎక్కడ అడుగుపెట్టినా సంచలనం సృష్టించే రిలయన్స్, ఇప్పుడు చల్లని ఐస్‌క్రీమ్ మార్కెట్‌ను వేడెక్కించేందుకు సరికొత్త వ్యూహంతో వచ్చింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ‘బాంబే క్రీమరీ’ (Bombay Creamery) పేరుతో సరికొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దీని ధర కేవలం ₹10 నుంచే మొదలవుతోంది!

సామాన్యుడి జేబుకు సరిపోయేలా.. కేవలం పది రూపాయలకే!
ప్రస్తుతం మార్కెట్‌లో ఒక మంచి ఐస్‌క్రీమ్ కప్, కోన్ లేదా స్టిక్ కొనాలంటే కనీసం ₹20 నుంచి ₹30 దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్‌లలో అమూల్ వంటి ప్రముఖ బ్రాండ్ల పాపులర్ ఫ్లేవర్లు కూడా ₹20 కంటే తక్కువకు దొరకడం కష్టం. అలాంటి సమయంలో, బాంబే క్రీమరీ ద్వారా కప్, కోన్, స్టిక్ ఐస్‌క్రీమ్‌లను కేవలం ₹10కే అందిస్తూ ఎంట్రీ లెవల్ ధరను అంబానీ ఏకంగా సగానికి తగ్గించేశారు.
ప్రస్తుతం ఈ ఐస్‌క్రీమ్‌లను పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రతి వీధిలోని కిరాణా కొట్టు వరకు విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక.
షేర్ మార్కెట్‌లో ప్రకంపనలు
రిలయన్స్ ఎంట్రీ వార్త బయటకు రావడమే ఆలస్యం.. స్టాక్ మార్కెట్‌లోని మిగతా ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీలకు చెమటలు పట్టాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ప్రముఖ బ్రాండ్ ‘క్వాలిటీ వాల్స్’ షేర్లు బీఎస్‌ఈలో 3 శాతం మేర పతనమై ₹43కి పడిపోయాయి. గత వారం రోజులుగా వరుసగా నష్టాలు చవిచూస్తున్న ఈ షేరు విలువ మొత్తం 11 శాతం మేర దిగజారడం రిలయన్స్ తెచ్చిన పోటీ తీవ్రతను స్పష్టం చేస్తోంది.
ధర తక్కువే.. కానీ క్వాలిటీలో తగ్గేదేలే!
ధర తక్కువగా ఉంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో?  అనే అనుమానం ఎవరికైనా రావడం సహజం. అయితే దీనిపై కంపెనీ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ పూర్తి స్పష్టతనిచ్చారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘బాంబే క్రీమరీ’ని ఎలాంటి కృత్రిమ పదార్ధాల ఆధారంగా కాకుండా, స్వచ్ఛమైన డెయిరీ క్రీమ్‌తో తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి భారతీయ కుటుంబ బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటూనే, అద్భుతమైన రుచిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సాంప్రదాయ వెనిల్లా, చాక్లెట్‌తో పాటు నేటి తరం కోరుకునే సాల్టెడ్ క్యారమెల్, మచ్చా, తిరమిసు వంటి ఆధునిక ఫ్లేవర్లను కూడా తీసుకురానున్నారు.
క్యాంపా కోలా ఫార్ములా మళ్లీ రిపీట్!
ఇలా ధరల యుద్ధం (Price War) మొదలుపెట్టడం రిలయన్స్‌కు కొత్తేమీ కాదు. గతంలో ‘క్యాంపా కోలా’ కూల్‌డ్రింక్ 200ml బాటిల్‌ను కేవలం ₹10కే రీ-లాంచ్ చేసి పెను సంచలనం సృష్టించారు. అంతర్జాతీయ బ్రాండ్లు సైతం తమ రేట్లు తగ్గించుకునేలా చేసిన క్యాంపా కోలా, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి ఏకంగా ₹4,700 కోట్ల గ్రాస్ సేల్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే ‘₹10 మ్యాజిక్’ను ఐస్‌క్రీమ్ రంగంలోనూ అమలు చేస్తోంది.
భారీగా ఎదుగుతున్న మార్కెట్.. రిలయన్స్ లాంగ్ గేమ్‌!
ఎక్స్‌పర్ట్ మార్కెట్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ఐస్‌క్రీమ్ మార్కెట్ ఏటా 15% వార్షిక వృద్ధి రేటుతో (CAGR) వేగంగా ఎదుగుతోంది. రాబోయే 2035 నాటికి ఈ మార్కెట్ విలువ 16.10 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఎండ తీవ్రత పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, ముఖ్యంగా చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్ వినియోగం ఊపందుకోవడం ఈ మార్కెట్‌కు పెద్ద బలం.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది రిలయన్స్ వేసిన ఒక సుదీర్ఘమైన వ్యూహాత్మక అడుగు. తమకున్న భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల్లో కూడా ప్రత్యేక ఫ్రీజర్లను ఏర్పాటు చేసి, ఉత్పత్తిని వినియోగదారుడి కళ్లముందు ఉంచేందుకు రిలయన్స్ భారీగా ఖర్చు చేస్తోంది. క్యాంపా కోలా మాదిరిగానే ‘బాంబే క్రీమరీ’ కూడా క్లిక్ అయితే, మార్కెట్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పాత బ్రాండ్లు తమ ఉనికిని కాపాడుకోవడానికి సరికొత్త దారులు వెతుక్కోక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *