Yeshanagula

Yesha Nagula Lyrics Decode: ఏష నాగుల” వెనుక ఇంత కథ, అర్థం ఉందా?

Yesha Nagula Lyrics Decode: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఎక్కడ విన్నా ఒకే ఒక్క పాట మార్మోగిపోతోంది.. అదే ‘ఏష నాగుల’. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి విడుదలైన ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. జంగిరెడ్డి, ప్రభ గాత్రం, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఆడియన్స్ ని  ఉర్రూతలూగిస్తుండగా.. ఈ పాటను ఇంత లోతుగా, నేటివిటీతో రాసిన ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ లిరిక్స్ వెనుక ఉన్న అసలైన నేపథ్యాన్ని, పదాల అంతరార్థాన్ని ప్రత్యేకంగా వివరించారు.

జానపద మూలాల నుంచి పుట్టిన గీతం..

ఈ పాట నేపథ్యం గురించి రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “ఇది నిజానికి తెలంగాణ పల్లెల్లో ఎప్పటినుంచో పాడుకునే సాంప్రదాయ కోలాటం పాట. జంగిరెడ్డి గారి ద్వారా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా కోరడంతో, జంగిరెడ్డి గారితో మాట్లాడి  ఆయనకి తగిన పారితోషకం ఇచ్చి, అధికారిక హక్కులు తీసుకుని కథకు అనుగుణంగా మార్చాం. స్పెషల్ సాంగ్ అనగానే ఎక్స్‌పోజింగ్, ద్వంద్వార్థ(డబల్ మీనింగ్) పదాలు అవసరం లేకుండా.. 1980ల నాటి స్వచ్ఛమైన తెలంగాణ శృంగారాన్ని, ఆడపిల్ల విరహాన్ని ఆవిష్కరించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

పాటలోని మట్టి పదాలు – వాటి గూఢార్థాలు:

గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో: ‘గల్మ’ అంటే గడప లేదా వాకిలి. తెల్లవారుజామునే వాకిట్లో అందంగా ముగ్గు వేసినట్లుగా, ప్రియుడి రాక కోసం తానూ అందంగా ముస్తాబై ఎదురుచూస్తున్నానని అర్థం.

జిమ్మెదారి పటేలో: ‘జిమ్మెదారి’ అంటే బాధ్యత (Responsibility). నా బాధ్యతను స్వీకరించి, నన్ను తనదానిగా చేసుకున్న నా ప్రియుడా అనే భావన ఇందులో కనిపిస్తుంది.

నీతోవల నా సూపులు కావలున్నయో: ‘తోవ’ అంటే దారి. ప్రియుడు ఏ వైపు నుంచి వస్తాడో అని దారులన్నింటి వైపూ ఆమె చూపులు కాపలా కాస్తున్నాయని చెబుతోంది.

అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం: ‘అర్ర’ అంటే గది. గదిలో కొడిగడుతున్న గుడ్డిదీపంలా విరహంతో ప్రాణం అల్లాడిపోతోందని, ఎంత వద్దనుకున్నా మనసు వినడం లేదని తెలిపే భావం.

బుడ్డపరకల కూర & బుడమట్లబువ్వ: ఆడవాళ్ళు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టమైన వంటలు చేయడం గ్రామీణ సంస్కృతి. వాగులలో దొరికే బుడపరకల చేపల కూర, సువాసనభరితమైన బుడమ వడ్ల అన్నం వండి తన ప్రియుడి కోసం వేచిచూడటం ఆమె అనురాగానికి ప్రతీక.

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల: ఇది ప్రసిద్ధ జానపద కోలాటం బాణీని కథలోని విరహ సందర్భానికి ముడిపెడుతూ రచయిత వాడిన విధానం. ఇంట్లో ఉండి బాధపడే బదులు కట్ట మీదకు వచ్చి కలవాలనే ఆహ్వానం.

వాయిల్ చీర సింగులు & జబ్బల రైక హుక్కులు: వాయిల్ చీర కొంగుతో ప్రియుడు గతంలో చెమట తుడుచుకున్న స్పర్శను, అతని వేళ్ల స్పర్శను తలచుకుని అనువణువూ పులకించిపోవడాన్ని సూచించే రొమాంటిక్ వ్యక్తీకరణ.

చెవి సత్తుకమ్మ & బొంత: అతడు గతంలో చెవిలో చెప్పిన సరసపు మాటలు గుర్తొచ్చి కమ్మ కూడా మత్తుగా మొత్తుకుంటోందని, అతడు దొర్లిన బొంతను (పరుపు) అతని జ్ఞాపకంగా అలాగే ఉంచానని చెప్పడం గాఢమైన ప్రేమకు నిదర్శనం.

ఎచ్చని నీళ్లు & ఎంగిలి పూలు: ప్రియుడి కౌగిలి ద్వారా అంటిన సువాసన పోకూడదని వేడినీళ్ల స్నానం కూడా చేయడం లేదని, చిన్న గదిలోని ప్రతి మూలలో అతనితో గడిపిన క్షణాల ఆనవాళ్లను (జ్ఞాపకాలను) గుర్తుచేసుకుంటున్నానని తెలియజేయడం.

“జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా..
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో..
ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల..
మనం ఊగుదమే బాల…”
రచన: కాసర్ల శ్యామ్

 

తెలంగాణ మాండలికంలోని అసలైన అందాన్ని, పల్లె స్త్రీ నిష్కల్మషమైన ప్రేమానురాగాలను బూతు పదాలు లేకుండా సాహిత్యంలో నింపిన విధానం నేటి యువతరాన్ని సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *