Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో శనివారం ఉదయం తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్లలోని ఆటోమేటిక్ ప్రవేశ (In-Gate), నిష్క్రమణ (Out-Gate) గేట్ల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ సెన్సార్లు ఆన్‌లైన్ టికెట్లను రీడ్ చేయకపోవడంతో వందల మంది ప్రయాణికులు గేట్ల వద్దే చిక్కుకుపోయారు.ఉదయం వేళ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే రద్దీ సమయం (Peak Hours) కావడంతో ప్రధాన స్టేషన్లలో భారీ ఎత్తున క్యూ లైన్లు ఏర్పడి తీవ్ర గందరగోళం నెలకొంది.
సమయానికి ఆఫీసులకు, కళాశాలలకు చేరుకోలేకపోయామని, మెట్రో ఆన్‌లైన్ సేవల్లో తరచూ ఇలాంటి లోపాలు తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సాంకేతిక బృందాలు రంగంలోకి దిగి సర్వర్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి.
