Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: తెలంగాణలో ఆంధ్రా నేతల పెత్తనమా?.. సీఎం రేవంత్‌పై కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు.

Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదని, ఆయన ‘ఆంధ్రా రేవంత్ రెడ్డి’గా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ నామినేటెడ్ పోస్టులు, కీలక విభాగాల్లో ఆంధ్రా వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, మాజీ మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
బ్రాహ్మణ పరిషత్, యాదాద్రి బోర్డుల్లో స్థానికేతరుల పెత్తనమా?
  • బ్రాహ్మణ పరిషత్ నియామకాలపై అభ్యంతరం..
    పేద బ్రాహ్మణులను ఆదుకోవాల్సిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ పదవిని బసవరాజు శ్రీనివాసరావుకు కట్టబెట్టడాన్ని కవిత తప్పుబట్టారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు, దళిత మహిళలను దూషించిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల నుంచి వారిని తొలగించి తెలంగాణ మేధావులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • యాదాద్రి ఆలయ బోర్డు వివాదం..
    తెలంగాణ భక్తుల సొమ్ముతో నిర్మించిన పవిత్ర యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఆంధ్రా హీరో భార్యకు సభ్యత్వం కల్పించడం తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనని అన్నారు.
  • కీలక విభాగాల్లో ఆధిపత్యం..
    రెడ్ కో (REDCO), ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోని కీలక పోస్టుల్లో ఆంధ్రా అధికారుల పెత్తనం నడుస్తోందని మండిపడ్డారు.

హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి..

మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఉద్దేశించి కవిత సంచలన డిమాండ్ చేశారు..
  • గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సొంత డెయిరీకి వేల కోట్ల లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ డెయిరీలను పక్కనబెట్టి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలకు పాలు సరఫరా చేయడం ‘క్విడ్ ప్రో కో’ కాదా అని ప్రశ్నించారు.
  • రేవంత్ రెడ్డికి హరీశ్ రావుతో లోపాయికారీ ఒప్పందం లేకపోతే వెంటనే ఆయనపై విచారణ జరిపించాలని, 500 మందికి పైగా విద్యార్థులున్న విద్యాసంస్థల్లో ప్రభుత్వ డెయిరీల పాలనే వాడేలా జీవో జారీ చేయాలని సవాల్ విసిరారు.

ఇనార్బిట్ మాల్ రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల తీరు సిగ్గుచేటు

  • హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఓ ఆంధ్రా ఎంపీ కొడుకు ఖరీదైన కారుతో ఒడిశాకు చెందిన యువతిని ఢీకొట్టి చంపిన ఘటనపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని కవిత తప్పుబట్టారు.
  • పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తండ్రి పేరు లేకుండా ఖాళీలు ఉంచారని, ఆల్కహాల్ టెస్టులో క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటన అడ్డంకులపై మాట్లాడతారు కానీ, పేద యువతి మృతి చెందిన కేసుపై ఎందుకు నోరు మెదపరని నిలదీశారు.

తెలంగాణ ప్రయోజనాలు, స్థానికుల ఉద్యోగ అవకాశాలు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *