AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా, అలాగే సీఐడీ (CID) అడిషనల్ డీజీగా పనిచేసిన ఆయన.. సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై సాధారణ శాఖాపరమైన విచారణ (Departmental Inquiry) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు విచారణాధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
నోటీసులకు స్పందించకపోవడంతోనే విచారణ..
-
గతేడాది సస్పెన్షన్: పరిపాలనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది జనవరిలోనే ఎన్. సంజయ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
-
ఆర్థిక అక్రమాల అభియోగాలు: తన అధికార పరిధిలో లేకపోయినప్పటికీ సుమారు రూ. 1.20 కోట్ల వరకు చెల్లింపులు (పేమెంట్స్) చేశారనే ప్రధాన అభియోగం ఆయనపై ఉంది.
-
వివరణ ఇవ్వని వైనం: నిధుల చెల్లింపులు, విధి నిర్వహణలో ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 8 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ ఆయన ఎలాంటి రాతపూర్వక సమాధానం ఇవ్వకపోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ విచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నిబంధనల ప్రకారం విచారణాధికారి సంజయ్‌పై వచ్చిన అభియోగాలను పరిశీలించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
