AE Nookaraju Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు కాకినాడకు తీసుకువచ్చారు. ఐదు రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఆగస్టు 22న ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసింది.
అనంతరం అక్కడి స్థానిక న్యాయస్థానం నుంచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు, నిందితుడిని రైలు మార్గంలో ఆదివారం అర్ధరాత్రి సామర్లకోట సమీపంలోని మేడపాడు రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆరుగురు సీఐలతో ముమ్మర విచారణ – నేడు కోర్టు ఎదుట హాజరు..
-
తీవ్రస్థాయిలో ప్రశ్నోత్తరాలు: కాకినాడ ఏఎస్పీ పర్యవేక్షణలో ఆరుగురు సీఐల ప్రత్యేక బృందం సోమవారం ఉదయం నుంచి సాధిక్ ఖాన్‌ను విచారిస్తోంది. కుటుంబ సభ్యులను ఎలా బుట్టలో వేసుకున్నాడు? బ్లాక్‌మెయిలింగ్, ఆర్థిక దోపిడీ, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
-
వైద్య పరీక్షలు & కోర్టు హాజరు: విచారణ అనంతరం నిందితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కేసులో మరిన్ని లోతైన ఆధారాలు సేకరించేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీకి కోరాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.
కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన నేపథ్యం – అసలేం జరిగిందంటే?..
-
ఆఖరి దశలో విషాదం: పిఠాపురం మండల పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు (61) వచ్చే జనవరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కానీ, సాధిక్ ఖాన్ పెట్టిన తీవ్ర మానసిక క్షోభను తట్టుకోలేక ఈ నెల 16న అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనవడు కార్తికేయరెడ్డి (10)తో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కం రైల్ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేశారు.
-
ఈదుకుంటూ బయటపడ్డ బాలుడు: 10 ఏళ్ల మనవడు కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు నదిలో ఈదుతూ కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పడవలో వెళ్లి ప్రాణాలతో కాపాడారు. నూకరాజు, సౌజన్య, మీనా మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
సూసైడ్ నోట్లలో సాధిక్ పాపాలు..
-
కలెక్టర్, ఎస్పీలకు ఏఈ లేఖ: “రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేకే చనిపోతున్నాం. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి” అని నూకరాజు వాట్సాప్‌లో సహోద్యోగులకు పంపిన లేఖ కేసులో కీలకంగా మారింది.
-
స్కూటర్ డిక్కీలో కుమార్తె రాసిన లేఖ: సౌజన్య రాసిన లేఖలో సాధిక్ తన ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, మతం మారాలని ఒత్తిడి తెచ్చాడని, భర్తను సైతం విషమిచ్చి చంపాడని సంచలన ఆరోపణలు చేసింది.
ఈ లేఖల ఆధారంగా రాజమహేంద్రవరం, కాకినాడ సర్పవరం పీఎస్‌లలో నమోదైన కేసుల విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు.
