Isha: భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా సంబరమైన ‘ఈశా గ్రామోత్సవం 2026’ తెలంగాణ ఎడిషన్ ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణలోని 15 జిల్లాల పరిధిలోని 25 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 843 జట్లు, 9,630 మంది గ్రామీణ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో 7,200 మంది పురుషులతో కూడిన 600 వాలీబాల్ జట్లు, 2,430 మంది మహిళలతో కూడిన 243 త్రోబాల్ జట్లు పోటీపడ్డాయి.
క్లస్టర్ స్థాయిల్లో విజయం సాధించిన 28 జట్లతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి డివిజనల్ రౌండ్ (స్టేట్ ఫైనల్స్) ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి ఛాంపియన్లుగా నిలిచిన జట్లు..
ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో గ్రామీణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు:
-
మహిళల త్రోబాల్ విజేతలు: ఫైనల్ పోరులో పాపడ్పల్లికి చెందిన ‘పాపడ్పల్లి ఫైటర్స్’ జట్టుపై విజయం సాధించి గోయచల్క గ్రామానికి చెందిన ‘కొయచలక వారియర్స్’ జట్టు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన ‘రాణి రుద్రమదేవి’ జట్టు, సంగారెడ్డి జిల్లా ‘చింతల్ చెరువు’ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
-
పురుషుల వాలీబాల్ విజేతలు: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ జట్టును ఓడించి రంగారెడ్డి జిల్లాకు చెందిన ‘దేవుని పడకల్’ జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. మెదక్ జిల్లా ‘గాడిపెద్దాపూర్’, నల్గొండ జిల్లా ‘వెలుమినేడు బ్రదర్స్’ జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
స్టేట్ ఫైనల్స్‌లో గెలిచిన జట్లకు రూ.15,000, రన్నరప్‌లకు రూ.10,000 నగదు బహుమతులు అందజేశారు.
ప్రత్యేక ఆకర్షణగా 84 ఏళ్ల బామ్మలు..
ఈ ఏడాది గ్రామోత్సవంలో ఖమ్మం జిల్లాకు చెందిన 84 ఏళ్ల నరసమ్మ, 83 ఏళ్ల కోటమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈశా గ్రామోత్సవ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కులుగా వీరు మైదానంలోకి దిగి యువతకు ఆదర్శంగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం లాంటి మారుమూల ప్రాంతాల వరకు విస్తరించిన ఈ క్రీడోత్సవం గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
“ఒక గ్రామం కలిసి ఆడినప్పుడు ఆ ఆనందం, ఐక్యత మొత్తం ఊరికే చెందుతుంది. గ్రామీణ భారతం శారీరకంగా చురుగ్గా, సామాజికంగా బలంగా ఉన్నప్పుడు దేశం ముందుకు వెళ్తుంది.”
— ఈశా బ్రహ్మచారి స్వామి అంబర
కోయంబత్తూరులో గ్రాండ్ ఫినాలే..
స్టేట్ లెవల్ విజేతలు సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగ కేంద్రంలో ప్రసిద్ధ ఆదియోగి సమక్షంలో జరగనున్న జాతీయ గ్రాండ్ ఫినాలేలో పోటీపడనున్నారు. 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి తరలివచ్చే జట్లతో జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం రూ. 1 కోటికి పైగా ప్రైజ్ మనీ అందించనున్నారు. గ్రాండ్ ఫైనల్ విజేతలకు రూ. 5 లక్షలు, రన్నరప్‌లకు రూ. 3 లక్షలు అందజేస్తారు.
తెలంగాణలో ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) మరియు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంచైజీ సంపూర్ణ సహకారాన్ని అందించాయి.
