Korean Kanakaraju Review

Korean Kanakaraju Review: వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా? సత్య కామెడీ వర్కవుట్ అయిందా?

Korean Kanakaraju Review:

నటీనటులు: వరుణ్‌ తేజ్‌, రితికా నాయర్‌, సత్య, సునీల్‌, మురళీధర్ గౌడ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు

నిర్మాణ సంస్థలు: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ

సంగీతం: తమన్‌ ఎస్‌.ఎస్‌

విడుదల తేదీ: ఆగస్ట్‌ 7, 2026

వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఒక గట్టి హిట్ అత్యవసరంగా మారింది. ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలనే కసితో, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ అనే వెరైటీ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు (ఆగస్ట్ 7) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కాడో లేదో రివ్యూలో చూద్దాం!

కథేంటంటే?

కొరియాలో దారుణ హత్యకు గురైన ఒక కొరియన్ గ్యాంగ్‌స్టర్ అస్థికలను ఒక బాటిల్‌లో భద్రపరుస్తారు. అనుకోకుండా ఆ సీసా చేతులు మారుతూ అనంతపురం జిల్లా పెనుగొండకు చేరుకుంటుంది. ఆ ఊరిలోనే కనకరాజు (వరుణ్ తేజ్) తన స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ కిష్టప్ప (సత్య)తో కలిసి చెక్క భజన బృందాన్ని నడుపుతుంటాడు. ఊరిలో ఉండే చెంగారెడ్డి (సునీల్) మనుషులతో కనకరాజుకు నిత్యం గొడవలు జరుగుతుంటాయి.

అదే ఊళ్లోని కియా (KIA) కార్ల కంపెనీలో పనిచేస్తూ, ఎలాగైనా కొరియా వెళ్లాలని కలలుకనే చైత్ర (రితికా నాయక్)తో కనకరాజు ప్రేమిలో పడతాడు. ఒకరోజు గొడవలో అనుకోకుండా ఆ అస్థికల సీసాలో మద్యం పోసుకుని తాగుతాడు కనకరాజు. దాంతో ఆ కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు ఒంట్లోకి చేరుతుంది. అక్కడి నుంచి కనకరాజు కొరియన్ భాష మాట్లాడుతూ ప్రవర్తిస్తుంటాడు. ఆ ఆత్మ చివరి కోరిక తీర్చడానికి కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియాకు ప్రయాణమవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కొరియన్ డాన్‌ను చంపింది ఎవరు? చివరికి ఆ ఆత్మ నుంచి కనకరాజుకి విముక్తి లభించిందా లేదా అన్నదే మిగతా కథ.

కథనం & విశ్లేషణ:

ఒకరి ఒంట్లోకి ఆత్మ రావడం, ఆ ఆత్మ కోరిక తీర్చడానికి ప్రయాణం కావడం అనేది దశాబ్దాల కాలం నాటి పాత ఫార్ములా కథే. అయితే దానికి పెనుగొండ బ్యాక్‌డ్రాప్, కొరియా గ్యాంగ్‌స్టర్ ఆత్మ అనే వినూత్న నేపథ్యాన్ని జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.

ఫస్టాఫ్ విషయానికి వస్తే కథనం కాస్త నెమ్మదిగా, రొటీన్‌గా సాగుతుంది. పాత కాలం నాటి పద్ధతిలోనే హీరో ఎంట్రీ ఇవ్వడం, వెంటనే ఒక పాట, ఫైట్ రావడం.. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్ అంటూ కథ మొదటి గంటన్నర పాటు సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత షార్ప్‌గా ఉండేది. అయితే ఈ సాగదీతలోనూ నటుడు సత్య తన మార్క్ కామెడీతో సీన్లను నిలబెట్టేసి థియేటర్‌లో మంచి నవ్వులు పూయించాడు.

ఇక హీరో ఒంట్లోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన దగ్గర నుండి కథలో వేగం, ఆసక్తి పెరుగుతాయి. ప్రీ-ఇంటర్వెల్ ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ‘కొరియన్ కనకరాజు’ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ బ్లాక్ సెకండాఫ్‌పై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తాయి.

కానీ సెకండాఫ్‌లో కొరియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, అక్కడ సత్య చేసే హంగామా ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మకు, కనకరాజు క్యారెక్టర్‌కు మధ్య నడిచే క్లాష్‌లో ఇంకా మంచి సిట్యువేషనల్ కామెడీ పండించే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి కథనం లయ తప్పింది. సీరియస్ ఎమోషన్‌తో ముగించాల్సిన చోట ఏఐ (AI) షాట్స్, దేవుడు-ఆత్మల కాన్సెప్ట్‌ అంటూ తీసిన సీన్లు సిల్లీగా అనిపించి తీవ్రంగా నిరాశపరుస్తాయి. అంతవరకు బాగా నడిచిన సినిమాను క్లైమాక్స్‌లో తుస్సుమనిపించారు.

ఎవరెలా చేశారంటే?

  • వరుణ్ తేజ్: కనకరాజుగా సీమ కుర్రాడి పాత్రలోనూ, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన గెటప్‌లోనూ రెండు వైవిధ్యమైన వేరియేషన్స్ చూపించి నటన పరంగా మెప్పించాడు.
  • సత్య: ఈ సినిమాకి అసలైన హీరో సత్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సీన్‌లోనూ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్‌ను నవ్వుల్లో ముంచెత్తాడు. సినిమాను నిలబెట్టింది సత్యనే!
  • రితికా నాయక్ & ఇతరులు: రితికా క్యూట్‌గా కనిపిస్తూ తన పాత్ర పరిధి మేర నటించింది. సునీల్, మురళీధర్ గౌడ్, గెస్ట్ రోల్‌లో అవసరాల శ్రీనివాస్ ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగాలు:

సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా ఉంది, ముఖ్యంగా కొరియా విజువల్స్ బాగున్నాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించినా, పాత సినిమాల బిజిఎమ్‌లను గుర్తుచేస్తుంది. నిర్మాణ విలువలు (UV Creations & First Frame) ఎక్కడా తగ్గకుండా ఉన్నతంగా ఉన్నాయి.

చివరిగా.. (ఓవరాల్ వర్డిక్ట్)

పెనుగొండ టు కొరియా అంటూ ఐడియా వినూత్నంగానే ఉన్నా, దాన్ని ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ మళ్లీ తడబడ్డాడు. కేవలం సత్య నవ్వించే కామెడీ సీన్లు, వరుణ్ తేజ్ కష్టం వల్ల సినిమా అక్కడక్కడా నిలబడింది తప్ప, సరైన క్లైమాక్స్ లేక తేలిపోయింది.

ఇప్పటికే వరుస ప్లాపుల్లో ఉన్న యువి క్రియేషన్స్ (UV Creations) సంస్థ.. దర్శకుడు మేర్లపాక గాంధీకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఆయన మాత్రం బ్యానర్‌కు ఒక పక్కా హిట్ ఇవ్వడంలో మళ్లీ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి! సత్య కామెడీ కోసం, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి సరదాగా చూడొచ్చు.

రేటింగ్: 2.75 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *