Ujjaini Mahankali Rangam

Ujjaini Mahankali Rangam: నేను సంతోషంగా లేను.. తీవ్ర ఆగ్రహంతో ఉన్నాను..!

Ujjaini Mahankali Rangam: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన సంప్రదాయ ‘రంగం’ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత పచ్చిండీ (మట్టికుండ)పై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆమె తీవ్ర భావోద్వేగానికి, ఆగ్రహానికి లోనై మాట్లాడటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

తన ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పిన మాటలను ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు.

ఇచ్చిన మాట ఏదీ?.. నేను ఆగ్రహంతో ఉన్నాను!

రంగం భవిష్యవాణిలో స్వర్ణలత మాట్లాడుతూ అధికారుల తీరుపై, ప్రజల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..

నేను సంతోషంగా రాలేదు.. తీవ్ర ఆగ్రహంతో వచ్చాను! గత రెండేళ్లుగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారు తప్ప ఇప్పటివరకు ఆ పని పూర్తి చేయలేదు. మీపై నాకు కోపం ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రమాదాలు రాకుండా నేనే కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మరో ఆరు నెలల్లో నా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తి చేయాలి. అది పూర్తయితే మీరు కోరినవన్నీ నెరవేర్చి మేలు చేస్తాను.

భారీ వర్షాలు, అగ్నిప్రమాదాల హెచ్చరిక

ఈ ఏడాది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశముందని భవిష్యవాణిలో స్పష్టం చేశారు..

  • వర్షాలు & వరదలు: ఈ సంవత్సరం వర్షాలు కుంభవర్షాల్లా కురుస్తాయని, భారీ వర్షాలు ఇంకా వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయే, కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

  • ప్రమాదాలు: ఆకస్మిక అగ్నిప్రమాదాలు, తీవ్ర ప్రాణనష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే పాడిపంటలు మాత్రం సమృద్ధిగా బాగుంటాయని ఓదార్చారు.

  • సామాజిక విలువల క్షీణత: సమాజంలో ప్రజలు వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారి ధర్మం వైపు నడవకపోతే ప్రాణనష్టాలు కొనసాగుతూనే ఉంటాయని మచ్చరించారు.

అంబారీ ఊరేగింపుతో ముగియనున్న వేడుకలు

రంగం కార్యక్రమాన్ని తిలకించేందుకు, అమ్మవారి భవిష్యవాణిని వినేందుకు ఉదయాన్నే భారీ సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. భవిష్యవాణి ముగియడంతో ఈ ఏడాది సికింద్రాబాద్ బోనాల జాతర ప్రధాన ఘట్టాలు పూర్తయ్యాయి. అనంతరం అమ్మవారి శాంతి కళ్యాణం, గజరాజుపై అమ్మవారి అంబారీ ఊరేగింపు వైభవంగా నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *