Bhogapuram International Airport: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే క్షణం రానే వచ్చింది! విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రాధాన్యతతో నిర్మించిన అత్యాధునిక ‘అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం (ఆగస్టు 1) ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధానికి ఘన స్వాగతం – 13 వేల మందితో ‘ధింసా’ నృత్యం!
ప్రధాని మోదీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊహించని రీతిలో ఏర్పాట్లు చేపట్టింది.. ప్రధాని సభకు సుమారు రెండు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకలో ఏకంగా 13,000 మంది గిరిజన కళాకారులు కలసి ప్రదర్శించే సాంప్రదాయ ‘ధింసా నృత్యం’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు రోడ్‌షోలో పాల్గొంటారు.
ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు!
ఎయిర్పోర్ట్ శనివారం ప్రారంభమైనప్పటికీ, పూర్తిస్థాయి కమర్షియల్ విమానాల రాకపోకలు మాత్రం ఆగస్టు 17వ తేదీ (ఆగస్టు 16 అర్ధరాత్రి దాటిన తర్వాత) నుంచి ప్రారంభమవుతాయి.
-
వైజాగ్ సర్వీసుల మార్పు: ప్రస్తుతం విశాఖపట్నం (VTZ) విమానాశ్రయం నుంచి నడుస్తున్న అన్ని కమర్షియల్ విమాన సేవలను ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయానికి పూర్తిగా తరలిస్తారు. కొత్త ఎయిర్పోర్ట్ కూడా ప్రస్తుతం ఉన్న ‘VTZ’ కోడ్‌తోనే సేవలు అందిస్తుంది.
-
తొలి అంతర్జాతీయ విమానం: ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సింగపూర్ నుంచి వచ్చే విమానం భోగాపురంలో ల్యాండ్ అయ్యే మొదటి అంతర్జాతీయ విమానంగా చరిత్రకెక్కనుంది.
విమానాల షెడ్యూల్ ఇదే:
ఎయిర్ ఇండియా సంస్థ భోగాపురం నుంచి నడిచే ప్రాథమిక విమాన షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది..
-
హైదరాబాద్: రోజూ ఐదు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. (ఎయిర్ ఇండియా వారంలో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది).
-
విజయవాడ: రోజూ నాలుగు విమాన సర్వీసులు నడుస్తాయి.
-
బెంగళూరు: రోజూ రెండు సర్వీసులతో పాటు వారానికి మూడు ప్రత్యేక విమానాలు అందుబాటులో ఉంటాయి.
-
అంతర్జాతీయ సర్వీసులు: ప్రస్తుతం విశాఖ-సింగపూర్ మధ్య వారానికి 3 రోజులున్న స్కూట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఆగస్టు 17 నుంచి 4 రోజులకు పెరుగుతాయి. అబుదాబీకి కూడా వారానికి 4 రోజులు విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాబోయే 30 ఏళ్ల పాటు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే షెడ్యూల్డ్ విమాన సేవలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వ్యాపారం, ఐటీ, పారిశ్రామిక రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది!
