KTR

KTR: ఫార్ములా ఈ-రేసు కేసులో నాంపల్లి కోర్టుకు కేటీఆర్

KTR: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వివాదంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) శుక్రవారం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ (Anti-Corruption Bureau) కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

కేటీఆర్‌తో పాటు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎమ్‌డీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి కూడా న్యాయస్థానం ముందుకు వచ్చారు. విచారణ అనంతరం కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.

కోర్టు వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల సందడి

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో పాటు భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది.

కోర్టులో ప్రాథమిక విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం, నిందితులు రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు సమాచారం.

ఏసీబీ మోపిన ప్రధాన ఆరోపణలు ఇవే..

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసు నిర్వహణకు సంబంధించి దాఖలైన 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఏసీబీ పలు తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది:

  1. నిబంధనల ఉల్లంఘన: క్యాబినెట్, ఆర్థిక శాఖ మరియు న్యాయ శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఏసీబీ పేర్కొంది.

  2. ప్రజాధనం మళ్లింపు: హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) నిధుల నుంచి సుమారు రూ.55 కోట్లకు పైగా విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని, పన్నుల రూపంలో ప్రభుత్వంపై రూ.8.06 కోట్ల అదనపు భారం పడిందని ఆరోపించింది.

  3. క్విడ్ ప్రో కో ఆరోపణలు: ఈవెంట్‌ నిర్వహణకు సంబంధించి సదరు సంస్థలకు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా బీఆర్‌ఎస్ పార్టీకి రూ.44 కోట్ల మేర విరాళాలు (ఎలక్టోరల్ బాండ్లు) వచ్చాయని ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

“ఇది రాజకీయ కక్ష సాధింపే”: కేటీఆర్

అయితే, ఈ ఆరోపణలన్నింటినీ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి, ఈవీ (EV) రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ నిర్వహించామని తెలిపారు.

ఇందులో ఎలాంటి అవినీతి, రహస్య ఒప్పందాలు జరగలేదని.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే తమపై ఈ రకమైన “లొట్టపీసు” కేసులు బనాయిస్తోందని కొట్టిపారేశారు. ఛార్జ్‌షీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో, ఆగస్టు 25న జరగబోయే తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *