Revanth Reddy

Revanth Reddy: 2034 దాకా నేనే సీఎం.. విద్యాశాఖకు నేనెందుకు రాజీనామా చేయాలి?

Revanth Reddy: తెలంగాణ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి ఆధునిక బోధనా పద్ధతులను అధ్యయనం చేసి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ అభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకోవడమే కాకుండా, విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు.

నేనెందుకు రాజీనామా చేయాలి? పిల్లలకు ఓటు బ్యాంకు ఉండదు!

విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి? సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉదయం అల్పాహారం అందించినందుకా? ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) మార్చినందుకా? లేక పారదర్శకంగా టీచర్ల బదిలీలు పూర్తి చేసినందుకా? అని ప్రశ్నించారు.

నర్సరీ చదివే పసిపాప తనకు ఓటు వేయదని, ఓట్లు తెచ్చిపెట్టే ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల వంటి కీలక శాఖలను కాదని.. కేవలం మన పిల్లల భవిష్యత్తు కోసమే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని స్పష్టం చేశారు.

2034 వరకు నేనే సీఎం.. డౌట్ అక్కర్లేదు!

రాష్ట్రంలో ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న రూమర్లకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. 2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదు అని ధీమా వ్యక్తం చేశారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాను. చిన్నప్పుడు బడిలో ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగితే ‘సీఎం అవుతాను’ అని చెప్పేవాడిని.. ఇవాళ సీఎం అయ్యాను  అంటూ ప్రభుత్వ బడి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడారు.

టీచర్లకు కీలక హామీలు & సంస్కరణలు:

  • ఏటా 10-12 మంది టీచర్లకు విదేశీ శిక్షణ: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాలు నేర్పించేందుకు ప్రతి ఏటా 10 నుండి 12 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తామని తెలిపారు. వారికి పూర్తి జీతంతో కూడిన అధ్యయన సెలవుతో (Leave with pay) పాటు కావలసిన నిధులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

  • ప్రతి నెల 1వ తేదీనే జీతాలు: జీతాల చెల్లింపులో ఆలస్యం జరగదని, నెలాఖరు రాగానే ఒకటో తేదీనే ఉపాధ్యాయుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని గుర్తుచేశారు.

  • ఉపాధ్యాయుల సమస్యలు నా బాధ్యత: ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం చాలా తేలికైన విషయమని, కానీ ఉపాధ్యాయుల సమస్యలు, బదిలీలు చాలా సున్నితమైనవని.. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.

  • కిందిస్థాయి నుంచే సూచనలు రావాలి: విద్యాశాఖలో మార్పులు పైనుంచి రుద్దేవిగా కాకుండా, మండల స్థాయిలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుల సలహాల నుంచే రావాలని స్పష్టం చేశారు.

సమాజంలో వెనుకబాటుతనానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతేనని, బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచి ప్రభుత్వ బడిలో చదివితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే బలమైన నమ్మకాన్ని విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కలిగించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రేవంత్ రెడ్డి ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *