Mallikarjun Kharge: రాజ్యసభ వేదికగా పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల అంశంపై విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు.
12 ఏళ్లలో 152 పేపర్లు లీక్.. ఒక్కరికైనా శిక్ష పడిందా?
ఖర్గే తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని వరుస ప్రశ్నలతో నిలదీశారు:
-
లీకేజీల పరంపర: గత 12 ఏళ్లలో ఏకంగా 152 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ప్రతీసారి కఠిన చర్యలు ఉంటామని చెప్పడమే తప్ప ఒక్క నిందితుడికైనా కఠినంగా శిక్ష పడిందా అని ప్రశ్నించారు.
-
పోలీసుల దౌర్జన్యం: ఢిల్లీ వీధుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించడం విచారకరమని, దీనిపై హోంమంత్రి అమిత్ షా ఎందుకు నోరు విప్పడం లేదని సూటిగా అడిగారు. మీ నోరు కుట్టేశారా? అంటూ నిలదీశారు.
-
రాజీనామాల డ్రామా: విమర్శలు తట్టుకోలేక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోదీ సీటును కాపాడారని, కానీ ఆయనకు పార్లమెంట్‌లో ఏదో ‘యుద్ధ వీరుడి’ తరహాలో స్వాగతం పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఏసీ గదుల్లోంచి బయటకు ఈడ్చుకొస్తాం!.. సభలో కలకలం
ప్రసంగంలో భాగంగా ఖర్గే చేసిన ఒక వ్యాఖ్య రాజ్యసభలో పెద్ద దుమారాన్నే రేపింది. ఏదో ఒక రోజు ప్రజలు మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి నిలదీస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన పదాలు వాడుతున్నారని, భావోద్వేగాలకు లోనుకావద్దని హితవు పలికారు.
దీనికి వెంటనే స్పందించిన ఖర్గే స్పష్టతనిచ్చారు.. నేను అన్నది ప్రజాశక్తి గురించి! దేశంలో మహిళలు, విద్యార్థులు, సామాన్యులు తిరగబడితే ఎంతటి అధికారంలో ఉన్నవారైనా ఏసీ గదులను వదిలి బయటకు రాక తప్పదు అని వివరణ ఇచ్చారు.
ఖాళీ పోస్టులు నింపకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యం?
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఏకంగా 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, సరైన ఉపాధ్యాయులను నియమించకుండా ‘వికసిత్ భారత్’ సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పైగా అర్హతలు లేకపోయినా వర్సిటీలలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన ‘యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు’ కేవలం విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడానికే హడావుడిగా తెచ్చారని, ఇందులో లీకులను శాశ్వతంగా అడ్డుకునే పక్కా వ్యూహాలు ఏవీ లేవని, ఇది అసంపూర్ణ బిల్లు అని విమర్శించారు.
