AP Job Calendar 2026:

AP Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ఉద్యోగాలతో ‘జాబ్ క్యాలెండర్-2026’.. డేట్లు ఇవే!

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘జాబ్ క్యాలెండర్-2026’ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న మొత్తం 10,060 ఖాళీలను నాలుగు విడతల్లో భర్తీ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఉపాధి కల్పన మంత్రివర్గ ఉపసంఘం సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు రాకుండా అత్యంత పారదర్శకంగా, పక్కా ప్రణాళికతో నియామకాలు పూర్తి చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.

నాలుగు దశల నోటిఫికేషన్ల వివరాలు..

  • తొలి దశ (పూర్తయింది): విశ్వవిద్యాలయాల్లో (యూనివర్సిటీల్లో) ఖాళీగా ఉన్న 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు.

  • రెండో దశ (సెప్టెంబర్ 15): ఈ విడతలో 3,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. నిజానికి దీనిని ఆగస్టు 15న విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక అంశాలు మరియు అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు సెప్టెంబర్ 15కు షెడ్యూల్ చేశారు.

  • మూడో & నాలుగో దశలు (అక్టోబర్ 15): మిగిలిన రెండు దశల నోటిఫికేషన్లను అక్టోబర్ 15న ఒకేసారి విడుదల చేయనున్నారు. మూడో దశ ద్వారా 2,388 పోస్టులు, నాలుగో దశ ద్వారా 2,981 పోస్టులను నింపనున్నారు.

హోంశాఖలో నోటిఫికేషన్ల జాతర.. గ్రూప్-1 పోస్టుల పెంపు!

ఈ విడత భర్తీ ప్రక్రియలో పోలీస్, భద్రతా దళాల ఉద్యోగార్థులకు పెద్దపీట వేశారు. మూడో దశలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఏకంగా 2,225 ఖాళీలు హోంశాఖకు చెందినవే ఉండటం గమనార్హం.

మరోవైపు, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గ్రూప్-1 పోస్టుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ప్రతీ ఏడాదీ క్రమం తప్పకుండా ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు.

ఆగస్టు 6న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ఖాళీలన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించి, తుది ఆమోదం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో వేగంగా, పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసి యువతకు భరోసా ఇవ్వడమే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *