Crime News

Crime News: కళ్లలో పేపర్ స్ప్రే చల్లి కత్తులతో దాడి.. హత్య తర్వాత నిందితుడి ఇన్‌స్టాగ్రామ్ లైవ్!

Crime News: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి (దాసరి సురేందర్) దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేశారు. హత్య అనంతరం ప్రధాన నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పేపర్ స్ప్రే చల్లి.. కత్తులతో దాడి!

తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి మీర్‌పేట్‌లోని నందనవనం ప్రాంతానికి వచ్చాడు. సూరి అక్కడ ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న ఆఫ్రూజ్ (సల్మాన్ సోదరుడు) అక్కడికి చేరుకున్నాడు. మొదట సూరి కళ్లలో ‘పేపర్ స్ప్రే’ చల్లి, ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

క్రిమినల్ హిస్టరీ & ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెన్సేషన్

మృతుడు సూరిపై గతంలో సొంత భార్య, బామ్మర్ది సల్మాన్ హత్య కేసులతో పాటు వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయనపై నగర బహిష్కరణ (నగరం నుంచి వెలివేయడం) కూడా అమల్లో ఉంది. సూరిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఆఫ్రూజ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి తానే హత్య చేశానని చెప్పడమే కాకుండా, పోలీసులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వైరల్ వీడియో నిజమైనదా కాదా అనే దానిపై పోలీసులు ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

పోలీసుల తీవ్ర దర్యాప్తు

ఈ దారుణ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి దర్యాప్తు తర్వాతే హత్యకు గల అసలు కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *