Crime News: కర్ణాటకలోని ధార్వాడలో బుధవారం రాత్రి ఒక అపార్ట్మెంట్లో జరిగిన డాక్టర్ కిరణ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘోర హత్యకు పాల్పడిందనే అనుమానంతో ఆయన భార్య, కంటి వైద్యురాలు (ఆఫ్తాల్మాలజిస్ట్) అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
మ్యాట్రిమోనీ ప్రేమ పెళ్లి.. కట్ చేస్తే ఘోరం!
బెళగావి జిల్లా హెబ్బాళ గ్రామానికి చెందిన డాక్టర్ కిరణ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తుమందు) డాక్టర్‌గా పనిచేస్తున్నారు. విజయపురకు చెందిన ఒక ధనిక కుటుంబానికి చెందిన డాక్టర్ ప్రియాంక కంటి వైద్యురాలు. అయితే ఆమె ప్రాక్టీస్ చేయకుండా ఇంట్లోనే ఉంటోంది.
కిరణ్, ప్రియాంక ఇద్దరికీ గతంలోనే మొదటి భాగస్వాములతో విడాకులు అయ్యాయి. తొమ్మిదేళ్ల క్రితం మ్యాట్రిమోనీ యాప్ ద్వారా వీరిద్దరికీ పరిచయమై, అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ధార్వాడలోని రంకా స్టెల్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి నివసిస్తున్నారు.
సోఫాలో భార్య కాలక్షేపం.. పక్కనే రక్తం మడుగులో భర్త, కొడుకు!
గురువారం మధ్యాహ్నం డాక్టర్ కిరణ్‌కు ఆయన బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ప్రియాంకకు ఫోన్ చేయగా, “ఆయన నిద్రపోతున్నారు” అంటూ సమాధానం ఇచ్చింది.
అనుమానం తీరక ఒక బంధువు నేరుగా వారి ఫ్లాట్ దగ్గరకు వచ్చి కిటికీలోంచి లోపలికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి అతడు షాక్‌కు గురయ్యాడు. భర్త కిరణ్, 8 ఏళ్ల కొడుకు రక్తం మడుగులో పడి ఉంటే.. ప్రియాంక మాత్రం సోఫాలో కూర్చుని చాలా ప్రశాంతంగా మొబైల్ ఫోన్ చూసుకుంటూ కనిపించింది.
పోలీసుల ఎంట్రీ.. 10 కత్తిపోట్లు!
బంధువుల సమాచారంతో పోలీసులు వెంటనే ఫ్లాట్‌కు చేరుకున్నారు. కిరణ్ అప్పటికే చనిపోగా.. ఆయన 8 ఏళ్ల కుమారుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఒంటిపై 3 కత్తిపోట్లు ఉండగా, మరణించిన డాక్టర్ కిరణ్ శరీరంపై ఏకంగా 10 కత్తిపోట్లు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ దారుణం ఎలా జరిగిందో తనకు తెలియదంటూ ప్రియాంక నాటకాలాడుతుండటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ప్రవర్తన వింతగా ఉండటంతో, మానసిక స్థితి సరిగ్గా లేదనే అనుమానంతో కిమ్స్ (KIMS) ఆసుపత్రిలోని మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కోలుకున్న తర్వాతే అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్‌లోని సీసీటీవీ ఫుటేజ్, భార్యాభర్తల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నాడు డాక్టర్ కిరణ్ అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
