Gujarat

Gujarat: భారత్‌లో జైష్ ఉగ్ర కుట్ర భగ్నం!.. గుజరాత్‌లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

Gujarat: భారతదేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరపాలని చూస్తున్న ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) విజయవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ నుండి నడుస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మొహమ్మద్’ (JeM) నెట్‌వర్క్‌పై అధికారులు గురువారం (జూలై 16, 2026) విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని పటాన్ జిల్లా సిద్ధ్‌పూర్ తాలూకా ఖాదియాల్ గ్రామంలో ఏటీఎస్ పోలీసులు మెరుపు దాడులు చేసి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

పాత నిందితుల విచారణతో దొరికిన క్లూ!

ఈ నెల ప్రారంభంలో (జూలై 3న) గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటీఎస్ మరియు నిఘా వర్గాలు కలిసి జరిపిన దాడుల్లో ఎనిమిది మంది జైష్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. దేశంలో పెద్ద ఎత్తున వినాశనం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్న ఆ ఎనిమిది మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లీడర్లతో నిరంతరం మాట్లాడుతూ, వారికి లోకల్‌గా సహాయం చేస్తున్న ఈ ఐదుగురు కొత్త నిందితుల పేర్లు ఇంకా వివరాలు బయటపడ్డాయి.

పట్టుబడిన ఐదుగురు నిందితులు వీరే..

పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్న ఐదుగురు అనుమానితులను కింది విధంగా గుర్తించారు..

  1. బిలాల్ ఆబిద్ షేరా

  2. మహమ్మద్ అయూబ్ కాడీవాలా (అలియాస్ మహ్మద్ ఖాదియాసన్)

  3. మహమ్మద్ షఫీ ముఖీ (అలియాస్ షఫీ చాపి)

  4. మహ్మద్ హసన్ కరాడియా (అలియాస్ హసన్ హైదర్ పూరి)

  5. మహ్మద్ అయూబ్ సునాసరా (అలియాస్ మహ్మద్ ఖాలీ)

బాంబు తయారీ సామాగ్రి సీజ్.. జూలై 24 వరకు కస్టడీ!

అరెస్ట్ చేసిన నిందితుల ఇళ్ల నుంచి పోలీసులు బాంబులు తయారు చేయడానికి వాడే వివిధ రకాల వస్తువులను, అలాగే ఉర్దూ భాషలో ఉన్న జిహాదీ పుస్తకాలను, సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులలో ఒకరు గతంలోనే టైమ్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా.. వీరిని మరింత లోతుగా విచారించడానికి న్యాయస్థానం జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఐదుగురిని కస్టడీలో విచారించడం ద్వారా భారతదేశంలో వీరి నెట్‌వర్క్ ఇంకెక్కడైనా ఉందా? వీరికి ఇంకా ఎవరెవరు సహాయం చేస్తున్నారు? అనే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎస్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *