Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కిన్జరాపు రామ్మోహన్ నాయుడు ఇంకా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో కీలక భేటీలు జరిపారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందిస్తున్న సహకారం మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
తెలంగాణ టార్గెట్.. 5% నుండి 10% జీడీపీకి!
-
ఆర్థిక అభివృద్ధి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’ ద్వారా దేశాన్ని 2045 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని అనుకుంటోందని సీఎం చెప్పారు.
-
ఎయిర్పోర్టుల ప్రాధాన్యత: ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దీనిని 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే విమానాశ్రయాల కనెక్టివిటీ చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
-
విమర్శలకు కౌంటర్: “నేను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నానని కొందరు విమర్శిస్తున్నారు.. కానీ నేను వచ్చేది రాజకీయాల కోసం కాదు, రాష్ట్రాభివృద్ధికి మరియు ఇక్కడి సమస్యల పరిష్కారానికే” అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శకులకు గట్టి బదులిచ్చారు.
జూన్ 2, 2028 నాటికి కొత్త ఎయిర్పోర్టులు సిద్ధం!
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2, 2028 నాటికి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
-
వరంగల్ ఎయిర్పోర్ట్: చారిత్రక నగరమైన వరంగల్ విమానాశ్రయాన్ని కాకతీయ కళాకండాల ఉట్టిపడేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
-
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్: ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అదనంగా 1500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశ రక్షణ (డిఫెన్స్) పరంగా కూడా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ చాలా కీలకమైనదని ఆయన చెప్పారు.
-
ఉడాన్ (UDAN) నిధులు: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉడాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల కనెక్టివిటీని పెంచేందుకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. తెలంగాణలో ఈ ప్రాజెక్టుల కోసం పూర్తి సహకారం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
