Indian Railways

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై వాట్సాప్, స్క్రీన్‌షాట్ టికెట్లు చెల్లవు!

Indian Railways: ఇండియన్ రైల్వేస్ (భారతీయ రైల్వే) రైలు టికెట్ల బుకింగ్, డిజిటల్ టికెట్ల తనిఖీ విషయంలో సరికొత్త, కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై రైళ్లలో ప్రయాణించే వారు తమ టికెట్లను వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో గానీ, మొబైల్ స్క్రీన్‌షాట్‌లు, ఫొటోలు లేదా పీడీఎఫ్ (PDF) కాపీలుగా చూపిస్తే టీటీఈలు (TTE) వాటిని అంగీకరించరు. చెకింగ్ సమయంలో ఇలాంటి ఫేక్ లేదా కాపీ టికెట్లు చూపిస్తే.. మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా (వితౌట్ టికెట్) గుర్తిస్తారు. అంతేకాదు, మీకు భారీగా ఫైన్ (జరిమానా) వేసే ప్రమాదం కూడా ఉంది. దీనితో పాటు రైల్వే టికెట్ల ముందస్తు బుకింగ్ (అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్) గడువును కూడా ప్రభుత్వం 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించింది.

ఈ కొత్త రూల్స్ అన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ మీరు జనరల్ లేదా రిజర్వేషన్ లేని టికెట్లను రైల్వే ‘వన్ యాప్’ (Railway ONE App) లేదా ‘యూటీఎస్ యాప్’ (UTS App) ద్వారా బుక్ చేసుకుంటే.. ప్రయాణ సమయంలో ఆ టికెట్ ఖచ్చితంగా అదే యాప్‌లోనే ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్ నంబర్ మరియు ఏ ఫోన్ (రిజిస్టర్డ్ డివైజ్) ద్వారా టికెట్ బుక్ చేశారో.. ప్రయాణం చేసేటప్పుడు అదే ఫోన్‌ను టీటీఈకి చూపించాలి కానీ, దాన్ని స్క్రీన్‌షాట్ తీసి వేరే వాళ్లకు పంపించి చూపిస్తే కుదరదు. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త నియమాలను గమనించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు. ఒకవేళ కొడుకు తన తల్లి కోసం లేదా ఇంట్లోని మిగతా వారి కోసం టికెట్ బుక్ చేస్తే, అప్పుడు కొడుకు ఫోన్‌ను ప్రయాణం చేసేవారు తమ వెంట తీసుకువెళ్లాలా? అని ప్రశ్నిస్తున్నారు. లేదంటే అందరి ఫోన్లలో ఈ యాప్ ఎక్కించుకుని, అందులోనే టికెట్లు బుక్ చేసుకోవడం బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు ఎవరైనా వేరే ఊరికి వెళ్లిన తర్వాత, అక్కడ ఏదైనా ముఖ్యమైన పని ఉండి తిరిగి రావాలనుకుంటే, అవతలి వారికి టికెట్ బుక్ చేసుకోవడం రాకపోతే ఏంటి పరిస్థితి? అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రూల్ ఇప్పుడే వచ్చింది కాబట్టి దీని గురించి రైల్వే శాఖ నుండి మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *