Conductor Jobs

Conductor Jobs: ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక!

Conductor Jobs: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే స్వయంగా చేపట్టనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రతి ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో ఖాళీలు భారీగా పెరిగాయి. వీటిని పూరించడానికి గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు పలు రీజియన్లలో తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన 1,500 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

ఈ కండక్టర్ ఉద్యోగాలకు అభ్యర్థులను పదో తరగతి (SSC)లో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. రీజియన్ల వారీగా ఉన్న ఖాళీలు, ప్రభుత్వ రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ సాగుతుంది. అయితే, ఈ మార్కుల ఆధారిత ఎంపిక విధానం వల్ల ప్రస్తుతం ఆర్టీసీ అధికారుల ముందు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. గతంలో పదో తరగతి పరీక్షల్లో మార్కుల విధానం ఉండగా.. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు గ్రేడింగ్ (GPA) విధానాన్ని అమలు చేశారు. మళ్లీ ఇప్పుడు మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు.

దీనివల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కుల శాతం, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు వేర్వేరు విధానాలను ఎలా సరిపోల్చాలి? గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఎలా లెక్కించాలి? అనే అంశంపై ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఎస్సెస్సీ (SSC) బోర్డుకు ఒక లేఖ రాసింది. టెన్త్ బోర్డు నుంచి క్లారిటీ రాగానే, కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *