Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో ఇంటర్నేషనల్ టూరిజం ప్లాన్!.. దుర్గం చెరువు, తారామతి బారామతికి కొత్త లుక్..!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక రంగ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ (MCR HRD) సంస్థలోని బోధి పెవిలియన్‌లో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని చారిత్రక, సహజసిద్ధమైన ప్రదేశాలను గ్లోబల్ టూరిజం స్పాట్స్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడమైన ‘తారామతి బారామతి’ని మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు, ఐటీ హబ్‌కు గుండెకాయ లాంటి ‘దుర్గం చెరువు’ను పూర్తిస్థాయి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అలాగే నగరంలోని ప్రముఖ మంజీరా, దిల్‍కుషా గెస్ట్ హౌస్‍లను అత్యాధునికంగా రీమోడలింగ్ చేయాలని, టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. వికారాబాద్ లోని చారిత్రక వీరభద్రస్వామి దేవాలయాన్ని అధునాతనంగా అభివృద్ధి చేయాలని, ఈ ఆలయ నిర్వహణ కోసం యాదగిరిగుట్ట తరహాలోనే ఒక శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పర్యాటక రంగాన్ని ప్రకృతికి మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు వీలుగా ‘క్యూర్’ (CURE) పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ.. పెద్ద ఎత్తున ‘ఎకో టూరిజం’ ప్రాజెక్టులను చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రస్తుతం నగర ప్రజలను ఆకట్టుకుంటున్న గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే మహానగరంలో మరిన్ని సరికొత్త ఎకో పార్కులను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) లోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ మెగా గ్రీన్ ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని (Special Officer) నియమించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పాతబస్తీలోని చారిత్రక పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని కేవలం రాకపోకలకే కాకుండా ఒక అద్భుతమైన పర్యాటక జోన్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బ్రిడ్జిపై పర్యాటకుల కోసం ప్రత్యేక వసతులు, వినోద కార్యక్రమాలు కల్పించాలని, ఇందుకోసం అవసరమైతే ఆ మార్గంలో వెళ్లే ట్రాఫిక్‌ను ఇతర రూట్లలోకి మళ్లించి, ఆ ఏరియా మొత్తాన్ని హెరిటేజ్ వాక్‌గా మార్చే అవకాశాలను నిశితంగా పరిశీలించాలన్నారు. మరోవైపు, ఈ ఏడాది డిసెంబరులో తెలంగాణ వేదికగా నిర్వహించ తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ (Global Investment Summit) పై ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మెగా ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, ఇందుకోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితర కీలక అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *