CURE-2026 Act

CURE-2026 Act: హైదరాబాద్ నగర పాలనలో సరికొత్త విప్లవం!.. ముసాయిదా ‘క్యూర్ బిల్లు-2026’ విడుదల..!

CURE-2026 Act: హైదరాబాద్ మహానగర పరిధిలో పట్టణ పరిపాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. ‘కోర్ అర్బన్ రీజియన్ బిల్లు-2026’ (క్యూర్ – CURE Bill) పేరిట రూపొందించిన ఈ సరికొత్త ముసాయిదాను ప్రభుత్వం ఆదివారం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. నిజాం కాలం నాటి, అంటే సుమారు 70 ఏళ్ల క్రితం నాటి పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టం-1955 స్థానంలో ఈ నూతన సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ జనాభా గతంలో 15 లక్షల నుంచి ప్రస్తుతం దాదాపు 1.3 కోట్లకు పెరిగిన నేపథ్యంలో, ప్రస్తుత మెట్రోపాలిటన్ నగర అవసరాలకు పాత చట్టం ఏమాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది.

ఈ నూతన ‘క్యూర్’ బిల్లు ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) తో పాటు పొరుగునే ఉన్న సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలన పరిధిలోకి తీసుకురానున్నారు. మెట్రోపాలిటన్ స్థాయిలో ఒకే విధమైన సమన్వయం ఉంటూనే.. కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలన సాగేలా దీనిని డిజైన్ చేశారు. అయితే, పాత చట్టంలోని కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను వసూళ్ల వంటి ప్రధాన నిబంధనలను ఇందులోనూ కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఆధునిక అవసరాల కోసం మున్సిపల్ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్ సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించడం, కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించడం వంటి మార్పులను చేర్చారు.

ఆస్తి పన్ను (ప్రోపర్టీ టాక్స్) విధానంలోనూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు ప్రతిపాదించింది. ఇకపై పాత వార్షిక అద్దె విలువ విధానానికి స్వస్తి పలికి, మూలధన విలువ ఆధారిత విధానాన్ని (Capital Value Based System) అమలు చేయనున్నారు. ఆక్ట్రాయ్, కుక్క పన్నులను పూర్తిగా రద్దు చేస్తూ.. ఆస్తుల స్వీయ అంచనా (సెల్ఫ్ అసెస్మెంట్) పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతి ఆస్తికి ఒక సమగ్ర గుర్తింపు కోడ్‌ను కేటాయించనున్నారు. అలాగే, నగరంలో భవన నిర్మాణ అనుమతుల కోసం నిర్దేశిత కాలంలో అధికారులు స్పందించకపోతే దానంతట అదే ఆమోదం పొందేలా ‘డీమ్డ్ అప్రూవల్’ (Deemed Approval) వ్యవస్థను ప్రవేశపెట్టారు. చిన్నపాటి నిర్మాణ ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యలు తీసుకోకుండా.. దశలవారీగా సివిల్ జరిమానాలు విధించేలా నిబంధనలను సరళీకరించారు. వ్యాపారుల కోసం విడివిడి ఫీజులు లేకుండా ‘సింగిల్ ట్రేడ్ లైసెన్స్’ విధానాన్ని, నైట్ ఎకానమీకి ప్రత్యేక పాలసీని ఇందులో చేర్చారు.

నగర పాలనను అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ’ ఏర్పాటు కానుంది. నగరంలోని చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం హైడ్రా (HYDRAA) కు ఈ బిల్లు ద్వారా ప్రత్యేక చట్టబద్ధమైన బాధ్యతలు, అధికారాలు అప్పగించారు. విపత్తులు, వాతావరణ మార్పులు, ట్రాఫిక్ నియంత్రణ, ఆహార భద్రత, లింగ సమానత్వం అలాగే పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాలు రానున్నాయి. నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జలమండలికి (HMWSSB) అప్పగించనున్నారు. అత్యవసర సమన్వయం, బహుళ సంస్థల పర్యవేక్షణ కోసం ‘క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్’  ఒకే సమీకృత యుటిలిటీ బిల్లు విధానాన్ని తీసుకురానున్నారు.

ఈ ముసాయిదా బిల్లును పూర్తిస్థాయి చట్టంగా మార్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మూడు వేర్వేరు కార్పొరేషన్ల విలీనం, ఒకే విధమైన ఫీజుల వసూలు మరియు కొత్త ఆస్తి పన్ను విధానాలపై ప్రజలు, పట్టణ నిపుణులు, అన్ని వర్గాల భాగస్వాముల నుంచి సలహాలు స్వీకరించనున్నారు. ఈ క్యూర్ ముసాయిదా బిల్లుపై తమ స్పందనలు, సూచనలను తెలియజేయడానికి ఈ నెల 24 (జూలై 24, 2026) వరకు గడువు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *