Ketan Murder Case: యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన కొద్ది రోజులకే.. ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు సంబంధించిన ఒక ‘స్నాప్‌చాట్’ (Snapchat) సంభాషణ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చాట్ వివరాలు ఈ హత్య వెనుక ఉన్న ముందస్తు కుట్రను బట్టబయలు చేసేలా ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.
పెళ్లి కాదంటూనే ఐడీ కార్డు వివరాలు సేకరణ..
వివిధ నివేదికల ప్రకారం వైరల్ అవుతున్న ఆ చాట్‌లో.. సియా గోయల్ తన స్నేహితుడిని ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) ముందు, వెనుక వైపు ఫోటోలను పంపాలని కోరింది. పెళ్లి టికెట్లు బుక్ చేయడం కోసమే ఆ వివరాలు అడుగుతున్నట్లు ఆమె పేర్కొంది. ఆ మెసేజ్‌లో.. “ఐడీ కార్డు ముందు, వెనుక ఫోటోలు పంపించు. పెళ్లి టికెట్ల కోసం అడుగుతున్నా.. ఎలాగో ఆ పెళ్లి జరగదు అనుకో, అయినా సరే పంపించు” అని సియా టైప్ చేయడం గమనార్హం. దీనికి స్పందించిన ఆమె స్నేహితుడు, సదరు డాక్యుమెంట్లు ఇప్పటికే వాట్సాప్‌లో పంపించానని బదులిచ్చాడు. నవంబర్‌లో కేతన్‌తో పెళ్లి జరగాల్సి ఉండగా.. “ఎలాగో ఆ పెళ్లి జరగదు” అని జూన్ లోనే సియా మెసేజ్ చేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
16 జూలై వరకు జ్యుడీషియల్ కస్టడీ..
హత్య కేసులో 20 ఏళ్ల సియా గోయల్, ఆమె ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరిలను పుణె న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన మరుసటి రోజే ఈ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. జూన్ 18న పుణె జిల్లాలోని లోహగడ్ కోట కొండపై నుంచి కిందకు నెట్టి 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను వీరిద్దరూ అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన సీక్రెట్ కోడ్ చాట్స్ ఆధారంగా వారిని మరింత విచారించాల్సి ఉందని, పోలీసు కస్టడీని పొడిగించాలని దర్యాప్తు సంస్థ కోరినప్పటికీ.. న్యాయస్థానం నిరాకరిస్తూ నిందితులిద్దరినీ జూలై 16 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.
పాస్‌పోర్ట్ ధ్వంసం.. సీక్రెట్ కోడ్స్ గుర్తింపు:
కోర్టు విచారణ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశ్రీ విర్కుడ్ దర్యాప్తునకు సంబంధించిన కీలక మైలురాళ్లను న్యాయస్థానానికి వివరించారు..
-
పాస్‌పోర్ట్ సీజ్: కేతన్‌ను హత్య చేసిన తర్వాత నిందితురాలు సియా ముంబై పారిపోతుండగా.. దారిలో కేతన్ పాస్‌పోర్టును పారేసిన స్థలాన్ని గుర్తించి పోలీసులు పంచనామా చేశారు. అలాగే హత్యకు ముందు నిందితులు ప్లాన్ వేసిన రిహార్సల్ స్పాట్‌ను కూడా గుర్తించారు.
-
రెండో ఫోన్ లభ్యం: సియా గోయల్ దాచిపెట్టిన మరొక రహస్య మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపారు.
-
ఇమోజీలు, నిక్‌నేమ్స్: మొదటి ఫోన్ నుండి సేకరించిన డేటా ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. అందులోని చాట్స్ అన్నీ నిక్‌నేమ్స్, ఇమోజీలతో కూడిన రహస్య కోడ్ భాషలో ఉన్నాయని, వాటి పూర్తి అర్థం నిందితులను ముఖాముఖి కూర్చోబెట్టి విచారిస్తేనే బయటపడుతుందని ప్రాసిక్యూషన్ వాదించింది.
అయితే నిందితుల తరపు న్యాయవాదులు విపుల్ దుషింగ్, రామ్ షహానేలు స్పందిస్తూ.. ఇప్పటికే అవసరమైన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, కేవలం అంచనాల ఆధారంగా పోలీసు కస్టడీని కోరడం సరికాదని వాదించగా కోర్టు ఏకీభవించింది.
మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి: పుణె రూరల్ ఎస్పీ
కోర్టు విచారణ అనంతరం పుణె రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సందీప్ సింగ్ గిల్ మీడియాతో మాట్లాడారు. నేరం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న కొందరు కీలకమైన ప్రత్యక్ష సాక్షులు ఇప్పుడు పోలీసుల ముందుకు వచ్చారని వెల్లడించారు. “దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించాం. ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నాం. కేతన్ నుండి సియా ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసిందనే విషయాలను సరైన సమయంలో వెల్లడిస్తాం. ఇది ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యే అనడానికి మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి” అని ఎస్పీ స్పష్టం చేశారు.
