Nara Lokesh: జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రగతి ప్రణాళికను మంత్రి నారా లోకేష్ చాటిచెప్పారు. దిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘రిపబ్లిక్ టీవీ సమ్మిట్-2026’లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో సాగుతున్న పారిశ్రామిక విప్లవం, ఐటీ, ఏఐ (AI) డేటా సెంటర్ల ఏర్పాటు ఇంకా ఉపాధి కల్పనపై పక్కా రోడ్‌మ్యాప్‌ను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’తో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.
1. ఏపీని నడిపిస్తున్న ‘3S’ ఫార్ములా:
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) సింగిల్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ ఏకంగా 25% పెట్టుబడులను ఆకర్షిస్తోందని లోకేష్ వెల్లడించారు. దీనికి ఏపీ అనుసరిస్తున్న 3S ఫార్ములానే కారణమన్నారు:
-
Speed (వేగం): గతంలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు కేవలం 13 నెలల్లోనే హ్యాండ్‌షేక్ నుండి పనులు ప్రారంభించేలా (Shovel) అనుమతులు ఇచ్చామని, రక్షణ రంగానికి చెందిన ‘ఆమ్కా’ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు.
-
Stability (స్థిరత్వం): చంద్రబాబు నాయుడు గారి పారిశ్రామిక విధానాలు, నాయకత్వం కాల పరీక్షకు నిలిచి, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
-
Service (సేవ): పారిశ్రామికవేత్తలను తాము కేవలం వ్యాపారవేత్తలుగా చూడమని, వారిని దేశ నిర్మాతలుగా భావించి గౌరవిస్తామని లోకేష్ పేర్కొన్నారు.
2. గ్రీన్ ఎనర్జీ, పోలవరం నీటితో ఏఐ (AI) డేటా సెంటర్ల విప్లవం:
ఆర్నబ్ గోస్వామి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్, నీటి వనరుల సమతుల్యతపై లోకేష్ అద్భుతమైన గణాంకాలను వివరించారు.
గోదావరి నుండి ప్రతి ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఇది బ్రెజిల్ లేదా వియత్నాం దేశాల వార్షిక వినియోగంతో సమానం. మా డేటా సెంటర్ల విప్లవానికి అందులో కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే కావాలి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాగానే ఈ అవసరాలు తీరుస్తాం. అలాగే ఏపీ సౌత్ రీజియన్‌లో ఉన్న భారీ పునరుత్పాదక ఇంధన వనరులను (Renewable Energy) వాడుకుంటూ వన్ నేషన్-వన్ గ్రిడ్ ద్వారా డేటా సెంటర్లకు నిరంతర పవర్ సప్లై అందిస్తాం. మన దేశానికి సొంతంగా ‘సావరిన్ ఏఐ స్టాక్’ లేకపోతే భవిష్యత్తులో వెనుకబడిపోతాం.” అని లోకేష్ హెచ్చరించారు.
3. ‘ఫైటర్ జెట్ కాక్‌పిట్’ లాంటి రియల్ టైమ్ గవర్నెన్స్ డ్యాష్‌బోర్డ్:
ప్రభుత్వం కేవలం అప్పీజ్మెంట్ (ఓట్ల) రాజకీయం చేయకుండా డేటా ఆధారిత పాలన సాగిస్తోందని లోకేష్ వివరించారు. “2024 కంటే ముందు ఏపీలో అక్షరాస్యత రేటు దారుణంగా పడిపోయింది. ఎందుకంటే డ్రాపౌట్స్‌పై సరైన నిఘా లేదు. కానీ నేడు మా విద్యాశాఖలో క్షేత్రస్థాయి హెడ్మాస్టర్ నుండి మంత్రి వరకు ఒకే రకమైన డేటా డ్యాష్‌బోర్డ్ చూస్తున్నారు. ఈ డేటా విశ్లేషణ వల్లే ఈ ఏడాది ఏకంగా 85,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్ సంస్థలు డేటాను వాడగా లేనిది, ప్రభుత్వాలు ఎందుకు వాడకూడదు? కేవలం విద్యలోనే కాదు.. అగ్రికల్చర్ కమోడిటీ ధరలు, వర్షపాతం ఆధారంగా ఇరిగేషన్ నీటి సరఫరాను కూడా ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా ముందే ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు.
4. అమరావతి టైమ్‌లైన్ – $2.4 ట్రిలియన్ ఎకానమీ:
రాష్ట్రం ఏడాదికి 15% సీఏజీఆర్ (CAGR) వృద్ధి రేటు సాధిస్తూ 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది సీఎం చంద్రబాబు లక్షమని లోకేష్ గుర్తుచేశారు.
-
అమరావతి గడువు 2028: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన రూ.12-13 వేల కోట్ల స్టార్టప్ క్యాపిటల్‌తో అమరావతి ప్రాజెక్ట్ ‘పునః ప్రారంభమైందని’, దాదాపు రూ.60,000 కోట్ల పెట్టుబడితో 2028 నాటికి సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను ఓపెన్ చేస్తామని వెల్లడించారు. బిట్స్ (BITS) పిలానీ తన క్వాంటం క్యాంపసను ఇక్కడే ఏర్పాటు చేస్తోందని, వచ్చే ఏడాది నుండే అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు.
-
మూడు ఆర్థిక మండళ్లు: ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం (ఐటీ, డేటా సెంటర్లు), అమరావతి (క్వాంటం ఎకోసిస్టమ్), తిరుపతి/రాయలసీమ (భారీ ఉత్పాదక రంగం-మాన్యుఫ్యాక్చరింగ్ )లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఇస్తున్న ‘స్లీప్‌లెస్ నైట్స్’:
ఇంటర్వ్యూ ముగింపులో ఆర్నబ్ గోస్వామి “మీకు రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తున్న అంశం ఏంటి?” అని సరదాగా ప్రశ్నించగా.. లోకేష్ నవ్వుతూ “మా ఫాదర్ (చంద్రబాబు)” అని సమాధానమిచ్చారు. “మేము దేశంలోని 25% పెట్టుబడులను సాధించామని సంతోషపడుతుంటే.. నా బాస్ (సీఎం) నా వైపు చూసి.. ‘బాగానే ఉంది కానీ, మిగిలిన 75% పెట్టుబడులను టేబుల్‌పైనే వదిలేశావ్, వాటిని కూడా మన రాష్ట్రానికే ఎందుకు తీసుకురాలేదు?’ అని ప్రశ్నిస్తారు. ఆయన లాంటి కఠినమైన టాస్క్‌మాస్టర్ ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు గడపక తప్పదు, కానీ ఆయన వేగాన్ని అందుకుంటూ పనిచేయడం ఎంతో తృప్తిని ఇస్తుంది” అని లోకేష్ ముగించారు.
