Abhijit Deepak

Abhijit Deepak: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

Abhijit Deepak: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party – CJP) ఆందోళనల్లో ఒక్కసారిగా హింస చెలరేగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhiijeet Dipke) పై గుర్తుతెలియని వ్యక్తులు భౌతిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహోదగ్రులైన సీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో జైపూర్ వీధులు కాస్తా రణరంగంగా మారాయి.

ర్యాలీలో అసలేం జరిగింది?

నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) పరీక్ష పత్రా లీకేజీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జైపూర్‌లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ నిరసన ప్రదర్శనకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సాహంతో ఉన్న మద్దతుదారులు ఆయనను భుజాలపై ఎత్తుకుని స్లోగన్స్ ఇస్తూ సభా స్థలికి తీసుకెళ్తుండగా.. గుంపులోంచి వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా అభిజీత్ చెంపపై బలంగా కొట్టారు.

దాడి చేసిన అనంతరం సదరు వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన కాక్రోచ్ పార్టీ శ్రేణులు వారిని నడిరోడ్డుపైనే పట్టుకుని మూకుమ్మడిగా దేహశుద్ధి చేశారు. ఇరువర్గాల ఘర్షణతో స్థానికంగా తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ‘కాక్రోచ్ పార్టీ’ (CJP) అసలు కథేంటి?

భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న ఈ పార్టీ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కోర్టు ఉదంతం ఉంది.

గతంలో ఒక కేసు విచారణ సందర్భంగా.. దేశంలోని నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టుకు చెందిన గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలు (Cockroaches), పరాన్నజీవులతో పోల్చడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా.. యువత స్వాభిమానాన్ని చాటేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరుతో సరికొత్త పొలిటికల్ ఫోర్స్‌ను అభిజీత్ దీప్కే స్థాపించారు.

ఈ పార్టీ డిజిటల్ మీడియాలో అడుగుపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కోట్లాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు దీనికి ఫాలోవర్లుగా మారిపోయారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మొదట ఢిల్లీ కేంద్రంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన ఈ పార్టీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది.

శాంతియుతంగా సాగాల్సిన విద్యార్థి, నిరుద్యోగ యువత ఉద్యమంలోకి ఇలాంటి దాడులు ప్రవేశించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా లేదా పరీక్షల మాఫియా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధినేతపై దాడి జరిగిన నేపథ్యంలో సీజేపీ శ్రేణులు తమ నిరసనలను మరింత ఉధృతం చేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *