Rain Alert

Rain Alert: తెలంగాణకు వాన గండం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక!

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

దీనికి ప్రధాన కారణం నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటమే. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఇవి మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు పూర్తిగా విస్తరించనున్నాయి. వీటికి తోడు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గాలి మలపులు, బంగాళాఖాతం వైపు నుంచి వస్తున్న తేమ గాలుల వల్ల వాతావరణంలో ఈ భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఒక్కసారిగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి.

ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లగానే ఉంటుంది. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన నిలబడకూడదని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు కూడా వాతావరణాన్ని గమనించి బయటకు వెళ్లడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *