CM Vijay

CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన భేటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ప్రపంచ ఛాంపియన్లను ఓడించి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ నుంచి అపూర్వ గౌరవం దక్కింది. చెన్నైలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని ప్రజ్ఞానంద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తు పోటీల ఖర్చుల కోసం ప్రభుత్వం తరపున ఏకంగా రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం అందజేశారు.

ఈ భేటీలో ప్రజ్ఞానందకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా చెస్ బోర్డు తెప్పించి, కాయిన్స్ సర్ది ప్రజ్ఞానందతో మ్యాచ్ ఆడారు. వీరిద్దరి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు ఈ చెస్ మ్యాచ్ సాగింది. ఒక సీఎం తనతో బోర్డు ముందు కూర్చుని గేమ్ ఆడతారని తాను అస్సలు ఊహించలేదని, ఈ క్షణం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రజ్ఞానంద ఆనందం వ్యక్తం చేశాడు.

ముఖ్యమంత్రి విజయ్ చెస్ ఆడిన తీరుపై ప్రజ్ఞానంద ప్రశంసలు కురిపించాడు. సీఎం చాలా బాగా చెస్ ఆడుతున్నారని, ఆయన డిఫెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తానే గెలిచినప్పటికీ, ముఖ్యమంత్రి ఇంత ప్రతిభావంతంగా ఆడతారని అనుకోలేదన్నాడు. తాను ఎప్పుడు చెస్ ఆడుతుంటారని ముఖ్యమంత్రిని అడగ్గా.. అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి ఆడుతుంటానని విజయ్ చెప్పినట్లు ప్రజ్ఞానంద వివరించాడు.

ఈ భేటీలో తాను ప్రభుత్వం ముందు ఎలాంటి కోరికలు లేదా సహాయం కావాలని అడగలేదని, అయినప్పటికీ సీఎం విజయ్ స్వయంగా చొరవ తీసుకుని రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించారని ప్రజ్ఞానంద తెలిపాడు. ఈ ప్రోత్సాహం తన భవిష్యత్తు ఆటపై మరింత బాధ్యతను పెంచిందని, తనకు ఎంతో బూస్టింగ్ ఇచ్చిందని అన్నాడు. నార్వే టోర్నీలో తాను గెలుచుకున్న ట్రోఫీని కూడా ముఖ్యమంత్రికి చూపించి, అక్కడి అనుభవాలను పంచుకున్నట్లు చెప్పాడు. తమిళనాడులో క్రీడలకు, ముఖ్యంగా చెస్ ప్లేయర్లకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు ఈ సందర్భంగా ప్రజ్ఞానంద కృతజ్ఞతలు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *