Chandrababu Naidu: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన, ఆయన సభలపై అక్కడి కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కల్యాణ్ సభలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయాయని, ఇలాంటి సమయంలో మళ్లీ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
రాజకీయ నాయకులు ఒక రాష్ట్రం దాటి మరో రాష్ట్రంలో ప్రచారం చేయడం సర్వసాధారణమని చంద్రబాబు గుర్తుచేశారు. ఇటీవల తాను కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చానని చెప్పారు. అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నేతలు వచ్చి ప్రచారం చేశారని, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడికి వచ్చారని ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక ప్రాంత నాయకులు మరో ప్రాంతానికి వెళ్లడం ప్రజాస్వామ్యంలో సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అక్కడ కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమను జాతీయ పార్టీగా ప్రకటించుకుని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు తమ సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించడం కొత్తేమీ కాదన్న ఆయన.. అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు పెడితే అభ్యంతరాలు చెప్పడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు కొనియాడారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి పెద్ద పెద్ద దేశాల్లో తెలుగువారు కీలకమైన పదవుల్లో రాణిస్తూ, అక్కడి చట్టాలకు లోబడి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి సేవ చేసే వారే ఎక్కడైనా నాయకులుగా ఎదుగుతారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో కొందరు నేతలు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతిని తెలియజేయడం లేదని చంద్రబాబు అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడంలో, వారిని చైతన్యపరచడంలో పోటీ పడాలే తప్ప, ఇలాంటి అనవసర వివాదాలతో కొత్త సమస్యలను సృష్టించకూడదని సూచించారు. రెండు రాష్ట్రాలు తమ తమ దారిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో, విద్వేషాలు రేపడం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
