Reduce Screen Time

Reduce Screen Time: సెలవుల్లో పిల్లల స్క్రీన్ టైమ్ పెరుగుతోందా?.. కంట్రోల్ చేయడానికి 5 చిట్కాలు!

Reduce Screen Time: ప్రస్తుతం స్కూళ్లకు వేసవి సెలవులు ఉండడంతో  పిల్లలంతా తెగ సంబరపడిపోతున్నారు. ఒకవైపు బడికి వెళ్లాలనే టెన్షన్ లేదు, మరోవైపు హోమ్‌వర్క్ పూర్తి చేయాలనే ఒత్తిడి అసలే లేదు. అయితే, ఈ ఖాళీ సమయాన్ని పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు పట్టుకోవడానికో లేదా టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడానికో ఉపయోగిస్తున్నారు. రోజంతా ఇలా డిజిటల్ స్క్రీన్ల ముందు గడపడం వల్ల పిల్లల ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన నిజమేనని అంతర్జాతీయ పరిశోధనలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించిన ఒక తాజా అధ్యయనం ప్రకారం.. రోజుకు 6 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ లేదా టీవీ చూసే పిల్లల్లో హై బ్లడ్ ప్రెషర్ (అధిక రక్తపోటు) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది.

ఇలాంటి పరిస్థితిలో, పిల్లల చేతిలో నుండి ఫోన్‌ను బలవంతంగా లాక్కోవడం లేదా స్క్రీన్ టైమ్‌ను పూర్తిగా బంద్ చేయడం సాధ్యం కాదు. దానికి బదులుగా, వారి దినచర్యను ఎలా బ్యాలెన్స్ చేయాలో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలను డిజిటల్ స్క్రీన్ల నుండి సులభంగా దూరం చేయడానికి నిపుణులు సూచిస్తున్న 5 అద్భుతమైన మార్గాలు ఇక్కడ చూద్దాం.

1. స్క్రీన్ టైమ్‌కు గట్టిగా సమయ పరిమితిని విధించండి

సెలవుల రోజుల్లో పిల్లలను మొబైల్స్, టీవీలకు వంద శాతం దూరం పెట్టడం ప్రాక్టికల్‌గా కుదరకపోవచ్చు. కానీ, వారి స్క్రీన్ టైమ్‌ను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. ఇందుకోసం రోజంతటిలో ఒక నిర్దేశిత సమయాన్ని (ఉదాహరణకు రోజుకు 1 లేదా 2 గంటలు మాత్రమే) కేటాయించండి. ఆ టైమ్ లిమిట్ ముగియగానే ఫోన్ పక్కన పెట్టేలా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణను అలవాటు చేయండి.

2. అవుట్‌డోర్ యాక్టివిటీస్‌పై ఫోకస్ పెట్టండి

పిల్లలు ఎంత ఎక్కువ సమయం నాలుగు గోడల మధ్య ఇంట్లోనే ఉంటారో.. వారి శ్రద్ధ అంత ఎక్కువగా టీవీ, మొబైల్స్ వైపు మళ్లుతుంది. అందుకే, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఎండ తీవ్రత తగ్గాక పిల్లలను బయటకు తీసుకెళ్లండి. సమీపంలోని పార్కులకు తీసుకెళ్లి సైక్లింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్ లేదా మరేదైనా శారీరక శ్రమతో కూడిన ఆటలలో (Physical Activities) వారు పాల్గొనేలా ప్రోత్సహించండి. దీనివల్ల శరీరం చురుగ్గా మారడమే కాకుండా రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది.

3. క్రియేటివ్ యాక్టివిటీస్ వైపు మళ్లించండి

స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే పిల్లల మైండ్‌ను ఏదో ఒక ఆసక్తికరమైన పనిలో బిజీగా ఉంచడం చాలా అవసరం. మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉండి బయటకు పంపలేని సమయంలో.. ఇంట్లోనే క్రియేటివ్ ఆర్ట్స్ ఇంకా యాక్టివిటీస్‌లో వారిని నిమగ్నం చేయండి. ఇందుకోసం వారికి డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పించడం, కథల పుస్తకాలు చదివించడం, పేపర్ క్రాఫ్ట్స్ చేయించడం లేదా పజిల్స్ (సుడోకు, పహేలియా) వంటివి అలవాటు చేయండి. ఇవి స్క్రీన్ టైమ్‌ను తగ్గించడమే కాకుండా, పిల్లల్లో సృజనాత్మకతను (Creativity) అద్భుతంగా పెంపొందిస్తాయి.

4. గ్యాడ్జెట్స్‌కు దూరంగా.. కుటుంబంతో సమయం!

తల్లిదండ్రులు తమ బిజీ లైఫ్ నుండి రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. వారితో కలిసి క్యారమ్స్, చెస్, బిజినెస్ లాంటి బోర్డ్ గేమ్స్ ఆడటం, వారితో ముచ్చటించడం లేదా ఏదైనా వినోదాత్మకమైన యాక్టివిటీస్‌లో భాగస్వామ్యం కావడం వల్ల పిల్లలు ఫోన్ల గురించి పూర్తిగా మర్చిపోతారు. కుటుంబంతో కలిసి గడిపే ఈ నాణ్యమైన సమయం పిల్లల మానసిక, భావోద్వేగ వికాసానికి (Emotional Development) ఎంతో మేలు చేస్తుంది.

5. ముందుగా తల్లిదండ్రులే ‘రోల్ మోడల్’ కావాలి

పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పే మాటల కంటే.. వారు చేసే పనులను చూసే ఎక్కువగా నేర్చుకుంటారు. ఇంట్లోని తల్లిదండ్రులు లేదా పెద్దలే ఎల్లప్పుడూ సోషల్ మీడియాలోనో, ఆఫీస్ పనిలోనో మొబైల్‌తో బిజీగా ఉంటూ.. పిల్లలను మాత్రం ఫోన్ పక్కన పెట్టమంటే వారు అస్సలు వినరు. కాబట్టి, పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా స్క్రీన్‌ను వీలైనంత తక్కువగా ఉపయోగించడం ఉత్తమం. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా ఆ అలవాటును చాలా వేగంగా మార్చుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *