Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా వ్యవస్థలో మార్పులు, యువతకు ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్‌మెంట్ విధానాలపై ఇరు నేతలు ముఖ్యమైన చర్చలు జరిపారు.
సమావేశం ఆరంభంలో మంత్రి లోకేశ్‌కు మహారాష్ట్ర సీఎం సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆయనకు మంగళగిరి చేనేత శాలువా కప్పి గౌరవించారు. అలాగే తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. దీనికి బదులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లోకేశ్‌కు గణేశుడి విగ్రహాన్ని అందించి సత్కరించారు.
ఈ చర్చల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంత వేగంగా అనుమతులు ఇస్తుందో మహారాష్ట్ర సీఎంకు లోకేశ్ వివరించారు. అలాగే ఏపీ విద్యాశాఖలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను, యువతకు ఉద్యోగాల కోసం అందిస్తున్న శిక్షణ విధానాలను తెలియజేశారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖల్లో అమలవుతున్న అత్యుత్తమ పద్ధతులను కూడా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు.
విశాఖకు డేటా సెంటర్ల క్యూ.. ఎయిర్ ట్రంక్ సీఈవోతో లోకేశ్ భేటీ
మహారాష్ట్ర సీఎంను కలవడానికి ముందు, మంత్రి లోకేశ్ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లను నడిపే ప్రముఖ సంస్థ ‘ఎయిర్ ట్రంక్’ సీఈవో రాబిన్ ఖుదాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తమ ఎయిర్ ట్రంక్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు.
విశాఖ నగరం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లకు ఒక పెద్ద హబ్‌గా మారుతోందని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికే అక్కడ గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఐటీ పరిశ్రమల స్థాపనకు వైజాగ్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని ఆయన వివరించారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదా.. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
