GT vs RCB IPL Final 2026

GT vs RCB IPL Final 2026: బెంగళూరు గెలవాలంటే ఆ ‘6 ఓవర్లు’ చాలు!

GT vs RCB IPL Final 2026: క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. (ఆదివారం)ఈరోజు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ‘నరేంద్ర మోదీ స్టేడియం’ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య టైటాన్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఐపీఎల్ చరిత్రలో రెండో ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

ఈ సీజన్ అంతటా తిరుగులేని ఫామ్‌తో దూసుకుపోతున్న రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ అంచనా వేయలేం. క్వాలిఫయర్-1 లో ఓడినప్పటికీ, క్వాలిఫయర్-2 లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. సొంత మైదానం కావడం గుజరాత్‌కు ప్లస్ పాయింట్ అయితే, గత ఏడాది ఇదే పిచ్‌పై పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. కాబట్టి ఈ వేదిక ఇరు జట్లకూ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ సునాయాస విజయం సాధించాలంటే తొలి 6 ఓవర్లలో ఒక పక్కా ప్లాన్ అమలు చేయాల్సి ఉంటుంది.

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్: పేసర్లదే హవా!

అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఈ సీజన్‌లో గుజరాత్ ఇక్కడ చెన్నైపై 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, ఇక్కడి గ్రౌండ్ పరిస్థితులను బట్టి చూస్తే వికెట్లు తీయడంలో ఫాస్ట్ బౌలర్ల పాత్ర (సుమారు 76 శాతం) చాలా కీలకంగా మారనుంది. గుజరాత్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి ఆర్‌సీబీకి ఇదే అతిపెద్ద ఆయుధం.

టాస్ గెలిచి ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంటే.. ‘పవర్‌ప్లే’ వ్యూహం ఇదే!

ఒకవేళ ఫైనల్లో ఆర్‌సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే.. మ్యాచ్ ఫలితాన్ని శాసించే బాధ్యత అంతా బెంగళూరు పేస్ దళంపైనే ఉంటుంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, జాకబ్ డఫీ ఇంకా రసిక్ దార్‌లతో కూడిన ఆర్‌సీబీ బౌలింగ్ విభాగం మొదటి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను కట్టడి చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఫైనల్లో కూడా వారు అదే మ్యాజిక్ రిపీట్ చేయాలి.

  • టాప్ ఆర్డర్‌కు బ్రేక్స్: మొదటి 6 ఓవర్ల (పవర్‌ప్లే) లోనే గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లను త్వరగా ఔట్ చేయాలి.

  • రెండో ట్రోఫీ పక్కా: పవర్‌ప్లేలోనే ఈ ముగ్గురు కీలక వికెట్లను పడగొడితే ఆర్‌సీబీ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే గుజరాత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు ఆర్‌సీబీ పేస్ ఎటాక్‌ను తట్టుకుని మ్యాచ్ గెలిపించే అంత సత్తా లేదు.

ఒకవేళ ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే?

టాస్ ఓడి లేదా పిచ్ పరిస్థితుల వల్ల ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. వారి మైండ్ సెట్ చాలా అగ్రెసివ్‌గా ఉండాలి. గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను ఒత్తిడిలోకి నెట్టడానికి బెంగళూరు బ్యాటర్లు మొదటి 6 ఓవర్లలోనే 70 నుండి 80 పరుగులు బోర్డుపై చేర్చాలి. పవర్‌ప్లేలోనే ఇంతటి భారీ స్కోరు సాధిస్తే, ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌లు ఎలాంటి ప్రెజర్ లేకుండా స్వేచ్ఛగా ఆడి జట్టుకు భారీ టోటల్‌ను అందించగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *