GT vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగబోయే హై-వోల్టేజ్ రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. మొదటి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో భంగపడ్డ గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరడానికి ఇది ఆఖరి అవకాశం. మరోవైపు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసి పవర్‌ఫుల్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది.
జీటీ ముందున్న ఏకైక సవాలు.. 15 ఏళ్ల వండర్ కిడ్!
ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన భారీ విజయంలో ఆ జట్టు 15 ఏళ్ల విధ్వంసకర యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళ్లాలంటే సూర్యవంశీని అడ్డుకోవడం ఒక్కటే మార్గం. ఆ రికార్డుల వీరుడిని కట్టడి చేసేందుకు గుజరాత్ క్యాంప్ లో ఒక బృహత్ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ విషయమై గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ ఇంకా బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌ను ఔట్ చేసేందుకు జీటీ ‘మాస్టర్ ప్లాన్’!
ప్రస్తుత 2026 ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తిరుగులేని ఫామ్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 680 పరుగులు బాదాడు. ఈ రన్ మెషీన్‌ను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించగా.. పార్థివ్ పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో అన్ని జట్లు అతడిని త్వరగా అవుట్ చేయాలని ప్లాన్ వేసి విఫలమయ్యాయి. మేము వైభవ్ బ్యాటింగ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. అతడి బలహీనతలపై మా బౌలర్ల కోసం ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ఈ మ్యాచ్‌లో ఆ ప్లాన్స్‌ను గ్రౌండ్‌లో పక్కాగా అమలు చేసి అతడిని త్వరగానే పెవిలియన్‌కు పంపుతామనే నమ్మకం మాకుంది” అని పార్థివ్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.
అతను అసాధారణ ప్రతిభావంతుడు.. కానీ రన్స్ ఇవ్వం!
సూర్యవంశీ ప్రతిభను కొనియాడకుండా ఉండలేకపోయిన పార్థివ్.. ప్రత్యర్థిగా మాత్రం కఠినంగా ఉంటామని చెప్పారు. “మనం ప్రతిసారీ అతని వయస్సు గురించి మాట్లాడటం ఆపాలని నేను గతంలోనే చెప్పాను. అతను అసాధారణమైన క్రికెట్ ప్రతిభ గల ఆటగాడు. అతని బ్యాటింగ్ చూడటానికి ప్రతి క్రికెట్ అభిమాని ఇష్టపడతాడు. అయితే, ప్రత్యర్థి జట్టుగా మా కోణం నుండి చూస్తే.. ఈ చావోరేవో మ్యాచ్‌లో అతను సులభంగా పరుగులు చేయకుండా నిరోధించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ కుర్రాడిని గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తారా? లేక సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో చెలరేగి రాజస్థాన్‌ను ఫైనల్‌కు తీసుకెళ్తాడా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
