Karnataka Politics

Karnataka Politics: హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని చెప్పింది..!

Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం (High Command) ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది.

మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు!

గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులకు అత్యవసరంగా ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌తో పాటు మంత్రివర్గ సహచరులందరూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిద్ధరామయ్య మంత్రులతో మాట్లాడుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరింది. వారి ఆదేశాల మేరకే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. నేను ఈ పదవికి మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను.. నాకు ఎలాంటి బాధ లేదు. గత రెండున్నరేళ్లుగా మీరందరూ అందించిన సహకారానికి నా కృతజ్ఞతలు.

అంతేకాదు, పార్టీ హైకమాండ్ ఎవరిని తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినప్పటికీ.. వారికి తన పూర్తి మద్దతు, సహకారం ఉంటాయని ఈ 77 ఏళ్ల సీనియర్ నేత కేబినెట్ సహచరులకు హామీ ఇచ్చారు.

ముందంజలో డి.కె. శివకుమార్.. కానీ రాజ్ భవన్‌ వద్ద ట్విస్ట్!

సిద్ధరామయ్య రాజీనామా ప్రకటనతో తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ ముగిసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ పేరు ముందంజలో ఉంది. దాదాపు ఆయన పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, సిద్ధరామయ్య ప్రకటన తర్వాత తదుపరి అధికారిక ప్రక్రియపై ఒక చిన్నపాటి అనిశ్చితి నెలకొంది. సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. కానీ, రాజ్ భవన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. ఆయన కొన్ని అత్యవసర వ్యక్తిగత కారణాల వల్ల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లినట్లు తేలింది.

గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో సిద్ధరామయ్య తన రాజీనామాను నేరుగా గవర్నర్ కార్యాలయానికి పంపుతారా? లేదా గవర్నర్ తిరిగి వచ్చేవరకు వేచి చూస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా కర్ణాటక కొత్త బాస్ ఎవరనేది మరికొద్ది గంటల్లో పూర్తిగా తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *