Cocaine

Cocaine: గుజరాత్ తీరంలో భారీ డ్రగ్స్ వేట.. రూ. 1150 కోట్ల విలువైన కొకైన్ సీజ్!

Cocaine: దేశంలో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ అంతర్జాతీయ కొకైన్ విలువ మార్కెట్‌లో రూ. 1000 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

పాకిస్థాన్‌లోని ఖాసిం పోర్టు నుంచి బయలుదేరిన ఒక యూరోపియన్ నౌక గుజరాత్‌లోని కచ్ తీరానికి చేరుకుంది. అయితే ఈ నౌక కదలికలపై గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS), భారత కోస్ట్‌గార్డ్ అధికారులకు ముందే అనుమానం వచ్చింది. దీంతో వారు ఆ నౌకను నిశితంగా గమనించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నౌకలో ఉన్న కొందరు వ్యక్తులు అధికారులను చూసి భయపడి, తమ వద్ద ఉన్న కొన్ని సంచులను సముద్రంలోకి విసిరేయడాన్ని అధికారులు కళ్లారా చూశారు.

వెంటనే అలర్ట్ అయిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలోకి దూకి ఆ సంచులను సురక్షితంగా బయటకు తీశారు. వాటిని తెరిచి పరీక్షించగా, అందులో ఉన్నది అత్యంత ఖరీదైన కొకైన్ డ్రగ్స్ అని తేలింది. సంచుల్లో దాదాపు 100 కిలోలకు పైగా కొకైన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ఖరీదు సుమారు రూ. 1,150 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు.

ఈ భారీ డ్రగ్స్ రవాణాకు సంబంధించి నౌకలో ఉన్న ఒక వ్యక్తిని అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఆ యూరోపియన్ నౌకను పూర్తిగా సీజ్ చేసి తీరానికి తరలించారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని భారతదేశంలో ఎవరికి అందజేయాలని చూస్తున్నారు? ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసేందుకు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *