OTT Deals: టాలీవుడ్లో ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్) మార్కెట్, ఇప్పుడు చలనచిత్ర నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ బిజినెస్సే ప్రధాన ఆధారం. అయితే, మారుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సమీకరణాలు, కొత్త నిబంధనలు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల ప్యాన్-ఇండియా ప్రాజెక్టులకు పెద్ద తలనొప్పిగా మారాయి. తమ మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకోవాలని పట్టుదలతో ఉన్న నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్‌ల క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఓటీటీ డీల్స్ కుదరక ఇబ్బందులు పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆశించిన ఆఫర్ రాని ‘వృషకర్మ’ (Naga Chaitanya)
‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్లో నాగ చైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ అనే ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ (నాగ వంశీ) దీని థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
అయితే, ఈ సినిమా ఓటీటీ హక్కుల చర్చలు చివరి దశకు వచ్చినప్పటికీ.. మార్కెట్ మందగమనం వల్ల నిర్మాతలు ఆశించిన దానికంటే చాలా తక్కువ మొత్తానికి డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ తక్కువ ఆఫర్ సినిమా అంచనా వేసిన ఓవరాల్ బిజినెస్ రెవెన్యూపై గట్టి ప్రభావం చూపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘సంబరాల ఏటి గట్టు’పై ఓటీటీల కంట్రోల్ (Sai Dharam Tej)
ఇదే తరహా సవాలును మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఎదుర్కొంటున్నారు. ‘విరూపాక్ష’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న తేజ్.. తన తదుపరి చిత్రంగా ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామాను ఎంచుకున్నారు. తన కెరీర్లోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ పరంగా భారీ బిజినెస్ జరుగుతుందని మేకర్స్ గట్టిగా నమ్మారు.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ సంస్థలు కంటెంట్ వాల్యూయేషన్ల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. హీరో క్రేజ్ మాత్రమే కాకుండా.. ఆక్యురేట్ బడ్జెట్ లెక్కలను చూపిస్తేనే భారీ రేట్లు ఇస్తామని తెగేసి చెప్తున్నాయి. దీంతో ఈ చిత్ర నిర్మాతలు ఇంకా తమకు నచ్చిన, సంతృప్తికరమైన డిజిటల్ డీల్‌ను లాక్ చేయలేక వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ లూప్‌లో చిక్కుకున్న నిఖిల్ ‘స్వయంభూ’ (Nikhil Siddhartha)
‘కార్తికేయ-2’తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. ఈ సినిమా బిజినెస్ ఫ్రంట్‌లో మరింత పెద్ద సవాళ్లు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, ఓటీటీ బిజినెస్ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం వల్లే సినిమా రిలీజ్ ప్లాన్స్ ఆలస్యమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిఖిల్ ఇటీవలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, దానికి తోడు ‘స్వయంభూ’పై హిందీ మార్కెట్లో ప్రస్తుతానికి పరిమితమైన బజ్ ఉండటం దీని నాన్-థియేట్రికల్ బిజినెస్‌ను దెబ్బతీసిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓ మంచి డిజిటల్ డీల్ కోసం మరియు సరికొత్త విడుదల తేదీ కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
