Chiranjeevi Podcast

Chiranjeevi Podcast: ఓటీటీ వరల్డ్‌లోకి మెగాస్టార్‌ ఎంట్రీ.. బి.వి.ఎస్. రవి డైరెక్షన్‌లో సరికొత్త ‘పోడ్‌కాస్ట్’ షో..?

Chiranjeevi Podcast: వెండితెరపై ఐదు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోగా కోట్లమంది అభిమానులను అలరిస్తూ వస్తున్న టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి.. ఇప్పుడు డిజిటిల్‌ దునియాపై కన్నేశారు. ఆయన త్వరలోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన ‘పోడ్‌కాస్ట్‌’ టాక్ షో ద్వారా డిజిటల్‌ ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నట్లు మెగా సన్నిహిత వర్గాల సమాచారం. ఈ డిజిటల్ షో ద్వారా తన సినీ ప్రస్థానంలోని ఎవరికీ తెలియని ఎన్నో అరుదైన మైల్‌స్టోన్స్, షూటింగ్స్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన అనుభవాలను చిరంజీవి స్వయంగా పంచుకోనున్నారు.

‘అన్‌స్టాపబుల్’ క్రేజ్ తెచ్చిన దర్శకుడితోనే మెగా షో!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్‌’ షోను ‘ఆహా’ ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ షో వెనుక ఉన్న ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్‌. రవి ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్‌ను కూడా విభిన్నంగా తీర్చిదిద్దనున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ క్లూ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సున్నా నుండి మొదలై చిరంజీవి ఈరోజు చేరుకున్న శిఖరాల వెనుక ఉన్న అసలైన శ్రమను, ఆయన ఇన్‌స్పైరింగ్ లైఫ్‌ జర్నీని రాబోయే తరాలకు ఒక గైడ్‌లా అందించేలా ఈ షోను డిజైన్‌ చేస్తున్నట్లు బి.వి.ఎస్‌. రవి వెల్లడించారు.

గతంలో మెగాస్టారు కుమార్తె సుష్మిత కొణిదెల సైతం ఒక సందర్భంలో ఈ డిజిటల్ ప్రాజెక్ట్‌ గురించి హింట్‌ ఇచ్చారు. అయితే ఈ టాక్ షో ఫార్మాట్ ఎలా ఉండబోతోంది? చిరంజీవితో కలిసి పనిచేసిన పాత తరం ఇండస్ట్రీ దిగ్గజాలు ఈ షోకి గెస్టులుగా వస్తారా? లేదా చిరు కెరీర్‌లోని ఆల్-టైమ్ హిట్‌ సినిమాల వారీగా ఎపిసోడ్‌లను ప్లాన్‌ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవైపు సినిమాలు.. మరోవైపు డిజిటల్ విప్లవం!

ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇటీవల ఆయన 158వ చిత్రం కూడా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకవైపు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే, మరోవైపు ఈ క్రేజీ పోడ్‌కాస్ట్ షో ద్వారా చిరంజీవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *