Ebola Outbreak: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే ఎబోలా బారిన పడి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించి, మన దేశ పౌరులను అప్రమత్తం చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలకు అత్యవసరం అయితే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సూచించింది. ఒకవేళ ఇప్పటికే ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయులు ఉంటే.. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడి ప్రభుత్వాలు చెప్పే నియమాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.
భారత్‌లో ప్రస్తుతం ఎబోలా భయం లేనప్పటికీ, కేంద్ర ఆరోగ్య శాఖ ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఎయిర్‌పోర్ట్ లోని వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
ఈ వైరస్ భయాల కారణంగా ఈ నెల 28 నుంచి 31 వరకు ఢిల్లీలో జరగాల్సిన ‘ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్’ కూడా వాయిదా పడింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ సదస్సును మళ్లీ ఎప్పుడు నిర్వహించాలో కొత్త తేదీలను ప్రకటిస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం మరియు వైద్య నిపుణులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
