Car AC Settings

Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!

Car AC Settings: భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేడిలో కారులో ప్రయాణించాల్సి వస్తే, ఏసీ లేకుండా గమ్యస్థానానికి చేరుకోవడం అసాధ్యం. అయితే, చాలామంది వాహనదారులను వేధించే ప్రధాన సమస్య ఏంటంటే.. ఏసీ ఆన్ చేయగానే కారు మైలేజ్ బాగా తగ్గిపోతుంది. ఎండకాలంలో కారు ఏసీని సరిగ్గా ఎలా వాడాలి, కారులో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా ఏసీ చల్లదనాన్ని ఇంకా ఎక్కువ మైలేజ్‌ను.. రెండింటినీ ఒకేసారి పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ ఎందుకు తగ్గుతుంది?

ఎండకాలంలో కారులో ఏసీని ఆన్ చేసినప్పుడు కంప్రెషర్ రన్ అవ్వడానికి ఇంజిన్‌పై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని (పెట్రోల్/డీజిల్) వినియోగిస్తుంది. ఫలితంగా కారు మైలేజ్ తగ్గిపోయి, మీ జేబుపై అదనపు భారం పడుతుంది. కానీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

కారులో ఈ ముఖ్యమైన సెట్టింగ్ చేసుకోండి:

మీ కారు ఏసీ ఆన్ చేసినప్పుడు కూడా మంచి మైలేజ్ రావాలంటే, కారు డాష్‌బోర్డ్‌పై ఉండే ‘రీ-సర్క్యులేషన్’ (Air Re-circulation) బటన్‌ను సరిగ్గా ఉపయోగించడం తెలియాలి.

  • ప్రయాణం ప్రారంభంలో: మీరు కారు స్టార్ట్ చేసినప్పుడు మొదట ఈ రీ-సర్క్యులేషన్ బటన్‌ను ఆఫ్ (OFF) చేయాలి. దీనివల్ల ఏసీతో పాటు బయటి నుండి కూడా గాలి లోపలికి వస్తుంది.

  • కారు చల్లబడిన తర్వాత: కారు లోపల చల్లదనం పెరగడం ప్రారంభమైన వెంటనే ఈ బటన్‌ను ఆన్ (ON) చేయాలి. దీనివల్ల క్యాబిన్ లోపల ఉన్న చల్లటి గాలి బయటకు పోకుండా లోపల లోపలే తిరుగుతుంది. దీనివల్ల ఏసీ కంప్రెషర్‌పై లోడ్ తగ్గి, మైలేజ్ పెరుగుతుంది.

కారు ఎక్కగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? ఈ తప్పు చేయకండి!

ఎండలో పార్క్ చేసిన కారు లోపల వేడి గాలి (ఓవెన్ లాగా) పేరుకుపోతుంది. కారు ఎక్కగానే కిటికీలు మూసి ఏసీ ఆన్ చేస్తే కారు చల్లబడటానికి చాలా సమయం పడుతుంది, మైలేజ్ కూడా ఘోరంగా పడిపోతుంది.

చేయాల్సింది ఇదే: మొదట్లో కారును స్టార్ట్ చేసినప్పుడు, కొన్ని నిమిషాల పాటు కారు కిటికీలన్నింటినీ పూర్తిగా తెరిచి ఉంచి ఏసీని ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల కారు లోపల ఉన్న వేడి గాలి చాలా వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. కారు లోపల నార్మల్ టెంపరేచర్ వచ్చి చల్లబడటం ప్రారంభమయ్యాక కిటికీలను పూర్తిగా మూసివేయండి.

ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా ఎండకాలంలో పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా, కారు ఏసీ నుండి మంచి కూలింగ్‌ను కూడా పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *