PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి (కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్) అత్యంత కీలకమైన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ భేటీలో ప్రధానంగా పాలనా సంస్కరణలు, ప్రభుత్వ పనితీరు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం ఇంకా ప్రభుత్వ ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక లక్ష్యమైన “వికసిత్ భారత్ 2047” విజన్‌ను వేగవంతం చేయడంపై లోతైన చర్చలు జరిగాయి. దీనితో పాటు ప్రస్తుతం పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో కొనసాగుతున్న సంక్షోభం, దాని వల్ల దేశీయంగా కలగబోయే ఆర్థిక పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈ చర్చలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఈ సమావేశం ఎంతో “ఫలప్రదం” గా సాగిందని అభివర్ణించారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, దేశంలో “ఈజ్ ఆఫ్ లివింగ్” (జీవన సౌలభ్యం), “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (వ్యాపార సౌలభ్యం) లను మరింత మెరుగుపరిచేందుకు మంత్రులంతా తమ అద్భుతమైన అభిప్రాయాలను పంచుకున్నారని పీఎం పేర్కొన్నారు.

‘వికసిత్ భారత్’ అనేది నినాదం కాదు.. ఒక నిబద్ధత!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2047 నాటికి “వికసిత్ భారత్” నిర్మించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కేంద్ర మంత్రులంతా అంకితభావంతో పనిచేయాలని పీఎం మోదీ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని కేవలం వేదికలపై చెప్పే ఒక నినాదంగా కాకుండా, దేశ ప్రగతి కోసం ఒక నిబద్ధతగా (Commitment) భావించాలని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.
న్యూఢిల్లీలోని ‘సేవా తీర్థ్ ’లో సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమైన ఈ భేటీలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులతో పాటు రాష్ట్రస్థాయి సహాయ మంత్రులందరూ పాల్గొన్నారు. ఎన్డీఏ (NDA) ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతున్న తరుణంలో, ఈ ఏడాది జరిగిన ఈ పూర్తి స్థాయి మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ పనితీరుకు ఒక ‘మిడ్‌టర్మ్ రివ్యూ’ (మధ్యంతర సమీక్ష) లాగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా దాదాపు 9 కీలక మంత్రిత్వ శాఖలు తమ గత రెండేళ్ల ప్రగతి రిపోర్ట్, భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పై పీఎంకు నివేదికలు సమర్పించాయి. అలాగే క్యాబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ కూడా ప్రజెంటేషన్లు ఇచ్చాయి. అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరించిన మంత్రిత్వ శాఖలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం.. పౌరులకు ఇబ్బంది లేకుండా చూడాలి!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వాటి వల్ల దేశీయ ఇంధన, ఆర్థిక రంగాలపై పడే ప్రభావం గురించి పీఎం మోదీ ప్రస్తావించారు. ఈ సంక్షోభం కారణంగా దేశంలోని సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను, మంత్రులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంధనం (Energy), వ్యవసాయం, ఎరువులు, ఏవియేషన్ (విమానయానం), షిప్పింగ్ అలాగే లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఇప్పటికే ఈ అంతర్జాతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ఐదు దేశాల పర్యటన సక్సెస్.. పీఎంకు సన్మానం
ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే – ఇటలీ దేశాలలో భారత దౌత్య, వాణిజ్య బంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లిన ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటన విజయవంతమైనందుకు, అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయానికి గానూ ఈ సమావేశంలో ప్రధాని మోదీని కేంద్ర మంత్రులు ఘనంగా సత్కరించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పర్యటన ద్వారా అందిన కీలక దౌత్యపరమైన, పెట్టుబడుల ఫలితాల గురించి క్యాబినెట్‌కు క్లుప్తంగా వివరించారు.
