Nowhera Shaik: దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మంది అమాయక పెట్టుబడిదారులను ముంచేసిన రూ. 3,000 కోట్ల భారీ హీరా గ్రూప్ (Heera Group) ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక విజయం సాధించింది. గత కొంతకాలంగా పోలీసుల కన్నుగప్పి పరారీలో ఉన్న హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఎన్డీ అధికారులు హర్యానా పోలీసులతో కలిసి గురుగ్రామ్‌లో గురువారం (మే 21న) అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పత్రాలను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
36 శాతం లాభాలంటూ ఎన్నారైలకు సైతం టోకరా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్ఐఆర్ (FIR) ల ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నౌహీరా షేక్ మరియు ఆమె అనుచరులు ఇన్వెస్టర్లకు ఏడాదికి ఏకంగా 36 శాతం వరకు రిటర్న్స్ (లాభాలు) ఇస్తామంటూ నమ్మబలికారు.
-
వ్యాపారమే లేదు: హీరా గ్రూప్‌నకు అసలు ఎలాంటి నిజమైన వ్యాపార కార్యకలాపాలు లేవని, కేవలం పాత ఇన్వెస్టర్ల డబ్బును కొత్త ఇన్వెస్టర్లకు తిప్పుతూ మోసానికి పాల్పడినట్లు ఈడీ తేల్చింది.
-
ఎన్నారైలకూ వల: భారతదేశంతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలలో ఉంటున్న ముస్లిం ఎన్నారైలను (NRI) టార్గెట్ చేసి శరియా చట్టాల ప్రకారం లాభాలు ఇస్తామంటూ వందల కోట్లు వసూలు చేశారు. కానీ ఎవరికీ పైసా కూడా వెనక్కి ఇవ్వలేదు.
ఈ విధంగా వసూలు చేసిన ప్రజాధనాన్ని నౌహీరా షేక్ తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి, దేశవ్యాప్తంగా భారీగా చర, స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మోసం కోసం ఆమె 24 షెల్ కంపెనీలను స్థాపించి, 182 బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్.. బెయిల్ రద్దు!
ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఆమెకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు వీలుగా ఆ ఆస్తులను వేలం (Auction) వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, నౌహీరా షేక్ ఈ వేలం ప్రక్రియకు అస్సలు సహకరించకుండా పదేపదే అడ్డుపడటానికి ప్రయత్నించింది.
ఆమె ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ వారం రోజుల్లోగా లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ ఆమె కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పరారీలోకి వెళ్లడంతో, హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు మే 7, 2026న ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చివరకు పక్కా నిఘా సమాచారంతో గురుగ్రామ్‌లో ఆమెను జాయింట్ ఆపరేషన్ ద్వారా కస్టడీలోకి తీసుకున్నారు.
