Hamza Burhan: భారతదేశాన్ని కదిలించిన పుల్వామా ఉగ్రదాడి వెనుక కీలక సూత్రధారిగా ఉన్న హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించి మట్టుబెట్టారు. బుర్హాన్ తన కారులో వెళ్తుండగా.. మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బుర్హాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం 2022లోనే బుర్హాన్‌ను అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి అతడు భారత భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ (అత్యంత ప్రమాదకరమైన నేరస్థుల) జాబితాలో ఉన్నాడు. అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్ అలియాస్ హమ్జా బుర్హాన్ అయిన ఈ 23 ఏళ్ల ఉగ్రవాది.. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రత్నిపోరా గ్రామానికి చెందినవాడు. పాకిస్తాన్‌కు చెందిన ‘అల్ బదర్’ అనే ఉగ్రవాద సంస్థలో ఇతడు కీలక సభ్యుడిగా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాడు.
గత 2019లో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లేత్‌పోరా వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. భారత భద్రతా సిబ్బంది వెళ్తున్న కాన్వాయ్‌ను.. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆదీల్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాది పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో బలంగా ఢీకొట్టాడు. ఈ భయానక పేలుడులో 40 మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణమైన దాడికి వ్యూహం రచించిన ప్రధాన సూత్రధారుల్లో హమ్జా బుర్హాన్ ఒకడు. ఇప్పుడు అతడు పాకిస్తాన్ భూభాగంలోనే దారుణ హత్యకు గురికావడం గమనార్హం.
